
కలిసిరాని యాసంగి
● ఖరీఫ్‌తో పోల్చితే తగ్గిన పంట దిగుబడి ● ఎకరాకు 25 క్వింటాళ్లు కూడా రాని వైనం ● ఆందోళనలో అన్నదాతలు
వట్‌పల్లి(అందోల్): ఈసారి యాసంగి సీజన్ అన్నదాతలకు కలిసి రాలేదు. నాట్లు వేసిన రోజు మొదలుకొని పంట చేతికొచ్చేదాకా వరిపై చీడపీడలు దాడులు చేశాయి. కాండం తొలుచు పురుగు వంటి తెగుళ్లు పంటను దెబ్బతీశాయి. పంటను కాపాడుకోవడానికి రైతు పరిమితికి మించి మందులు పిచుకారి చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. మందులు కొనుగోలు చేయడానికి అన్నదాతలు అప్పుల పాలయ్యారు. వ్యవసాయ పెట్టుబడులు పెరగడం రైతులను ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది. దీంతో పంట దిగుబడిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం పంట చేతికి వస్తుండడంతో జిల్లా అంతటా వరి కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు..ఎకరానికి 28 క్వింటాళ్లు రావాల్సిన ధాన్యం కేవలం 20– 22 క్వింటాళ్లు మాత్రమే వస్తుందని రైతులు పేర్కొంటున్నారు. నాలుగైదు క్వింటాళ్లు నష్టపోతున్నామని వాపోతున్నారు.
95వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో 95,690 ఎకరాల్లో ఈ యాసంగిలో వరి పంటను సాగుచేశారు. తెగుళ్లు దాడి చేయడంతో దిగుబడిపై ప్రభావం చూపింది. వరి పంట సాగు చేయడంలో ఒక్కో రైతు ఎకరానికి రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టారు. దిగుబడి తగ్గడంతో వరి సాగు చేసిన రైతులకు పెట్టుబడి ఖర్చులు తలకు మించిన భారంగా మారి నష్టాలే మిగిలాయని రైతులు పేర్కొంటున్నారు. వరి సాగు ఖర్చులు బాగా పెరిగిపోయాయి. మూడేళ్ల క్రితం ఎకరానికి రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు పెట్టుబడి అయ్యేది. ఇప్పుడు దుక్కి మొదలుకొని మడి తయారీ విత్తనాలు చల్లడం, నాట్లు, ఎరువుల వేయడం, పురుగు మందుల పిచికారీ నుంచి పంట కోత వరకు ఎకరానికి రూ.22 వేల వరకు ఖర్చు అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు. పెరిగిన ఖర్చులో అధిక శాతం ఎరువులు, పురుగు మందులు, కూలి రేట్లు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుత దిగుబడులను బట్టి పెట్టుబడుల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.