
రూ.200 కోట్లతో లింగంపల్లి వంతెన
5న ప్రారంభోత్సవం
● మెదక్ ఎంపీ రఘునందన్ రావు
రామచంద్రాపురం(పటాన్‌చెరు) : రామచంద్రాపురం పట్టణంలోని లింగంపల్లి చౌరస్తాలో సుమారు రూ.200 కోట్లతో నిర్మించిన ఫ్లై ఓవర్‌ను 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం పలు శాఖల అధికారులతో కలసి ఫ్లై ఓవర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్లుగా లింగంపల్లి చౌరస్తాలో ట్రాఫిక్ సమస్యలతో వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోడీ నాయకత్వంలో జాతీయ రహదారిని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు జాతీయ రహదారిని ఆరు లైన్‌ల రోడ్డుగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. మెదక్, చేవేళ్ల పార్లమెంట్‌ను కలుపుతూ సంగారెడ్డి జిల్లాకు ముఖద్వారంగా ఉన్న ఈ ఫ్లై ఓవర్ హైదరాబాద్‌లోనే ప్రత్యేకతను చాటుకుంటుందని తెలిపారు. 5న సాయంత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెలికాప్టర్ ద్వారా ఇక్రిశాట్ ప్రాంగణానికి చేరుకుంటారని అక్కడ నుంచి 4 గంటలకు రోడ్డు మీదుగా ఫ్లై ఓవర్ వద్దకు చేరుకొని ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఇక్రిశాట్‌లోని హెలిప్యాడ్‌ను పరిశీలించారు. ఆయన వెంట బీజేపీ నేతలు రవికుమార్, నర్సింగ్ గౌడ్, రాంబాబు గౌడ్, సుధాకర్, సంతోష్, ఎండ్ల రమేశ్, జాతీయ రహదారుల రీజనల్ అధికారి కృష్ణప్రసాద్, ఇన్‌స్పెక్టర్ జగన్నాథ్, ఉప కమిషనర్ సురేశ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్ రెడ్డిలు పాల్గొన్నారు.