
క్షుద్రపూజలు కావు.. శాంతి హోమం
● బాలిక బలియత్నం అవాస్తవం ● సంగారెడ్డి డీఎస్పీ సత్తయ్యగౌడ్
సదాశివపేట(సంగారెడ్డి): పట్టణంలోని బీరువాలు తయారు చేసే కార్ఖానాలో క్షుద్ర పూజలు, బాలికను బలిచ్చే ప్రయత్నం జరిగిందంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని డీఎస్పీ సత్తయ్యగౌడ్ స్పష్టం చేశారు. శుక్రవారం సీఐ మహేశ్‌గౌడ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మేంద్ర 25 ఏళ్ల క్రితం వలస వచ్చి బీరువాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా జరగక, ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు పడ్డాడు. దీంతో తమ రాష్ట్రానికి చెందిన మున్సిల్ అనే స్వామిజీని సంప్రదించగా.. శాంతిపూజ, లక్ష్మీపూజ నిర్వహిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. దీంతో గత నెల 29న రాత్రి 8 గంటలకు పూజకు ఏర్పాట్లు చేశాడు. ఈ విషయం తన స్నేహితుడు బట్కరి ప్రభుకు తెలుపగా.. అతను కూడా తన కూతురితో కలసి పూజలో పాల్గొన్నాడు. శాంతిపూజకు సంబంధించిన వస్తువులు సకాలంలో చేరకపోవడంతో పూజ ఆలస్యం ప్రారంభమైంది. అయితే.. పూజల గురించి శబ్ధాలు రావడంతో కొందరు ఫొటోలు, వీడియోలు తీసి పోలీసులకు పంపించారని తెలిపారు. సీఐ మహేశ్‌గౌడ్ అదే రోజు రాత్రి సంఘటన స్థలానికి వెళ్లి పూజ హోమం చేస్తున్న వారిని విచారించగా.. క్షుద్రపూజలు కావని శాంతి హోమం చేస్తున్నట్లు తేలిందన్నారు.