
పర్యావరణం.. బోధన వినూత్నం
రామకృష్ణ కృషి అభినందనీయం
పర్యావరణ కాలుష్యంతో కలిగే అనర్థాలపై ఇంటరాక్టీవ్, ప్రాజెక్ట్, ప్రయోగాత్మక పద్ధతుల్లో వినూత్నంగా విద్యార్థులకు బోధిస్తూ వారిని చైతన్య పరచడం అభినందనీయం. పర్యావరణ పరిరక్షణకు బాధ్యతతో కృషి చేస్తున్న హెచ్‌ఎం రామకృష్ణ, తోటి ఉపాధ్యాయులు సునీత, నవనీతలను అభినందిస్తున్నాను.
– వెంకటేశ్వర్లు, డీఈఓ సంగారెడ్డి
● ఇంటరాక్టీవ్, ప్రాజెక్ట్,ప్రయోగాత్మకంగా వివరణ
● కాలుష్యంతో కలిగే అనర్థాలపై సూచనలు, సలహాలు
● నీటి వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ వాడకంపై అవగాహనలు
● పాఠశాలలో విరివిగా మొక్కలు నాటిస్తూ పలువురికి ఆదర్శం
మన భావితరాలకు సురక్షితమైన నివాసయోగ్యమైన భూమిని అందించడం మన కర్తవ్యం.. పర్యావరణానికి(భూమికి) హాని చేసే పనులు చేయకుండా పరిరక్షణకు కృషి చేయడం మనందరి బాధ్యత అంటున్నారు మండలంలోని నిజాంపూర్ కాలనీ ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం రామకృష్ణ. ఆ దిశగా అడుగులు వేస్తూ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై ఇంటరాక్టీవ్, ప్రాజెక్ట్, ప్రయోగాత్మక పద్ధతుల్లో వినూత్నంగా బోధిస్తున్నారు. విద్యార్థులను నిత్యం చైత్యనపరుస్తూ తల్లి లాంటి భూమిని కలుషితం చేయకుండా కాపాడాలని తన వంతు ప్రయత్నం చేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
– సదాశివపేట రూరల్(సంగారెడ్డి)
పాఠశాలలో పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటూ విద్యార్థులు స్వయంగా పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు సైతం పర్యావరణంపై కార్యకలాపాలు, అసైన్‌మెంట్‌లను రూపొందించేలా ప్రోత్సహిస్తున్నారు. పర్యావరణానికి హాని కల్గించే అంశాలను పరిశోధించి, సమస్యను ఎంచుకొని, పరిష్కారం కోసం ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. పర్యావరణానికి సంబంధించిన ప్రదేశాలకు విద్యార్థులను తీసుకెళ్లి అక్కడ జరుగుతున్న విషయాలను ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. పర్యావరణంపై వినూత్నంగా చేస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతున్నారు.
స్టాప్ సింగిల్ యూస్ ప్లాస్టిక్
ప్లాస్టిక్‌ను వాడేటప్పుడు 5ఆర్ ఐనా రిఫ్యూజ్, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రోట్లను గుర్తు చేస్తున్నారు. ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాసులు, కవర్లు, పేపర్లు బదులుగా స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు, బట్టలు వాడమని ఒకేసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని చూపిస్తూ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నారు.
ఆల్టర్నేటీవ్ ఎనర్జీ రిసోర్సెస్..
అంతరించని శక్తి వనరులైన పవన, సూర్యరశ్మి శక్తులను ప్రత్యామ్నాయ శక్తి వనరులుగా విరివిగా వాడుకోవాలని తద్వారా తరిగి పోయే శక్తి వనరులను కాపాడుకోవాలని తెలియజేస్తున్నారు.
కంట్రోలింగ్ ఎయిర్ పొల్యూషన్..
గాలి కాలుష్యం వల్ల కలిగే నష్టాలు, కాలుష్యానికి గల కారణాలను తెలిపి అదుపులో ఉంచడానికి అవసరమయ్యే సూచనలు తెలియజేస్తున్నారు. ఎక్కువగా వాహనాల నుంచి వెలువడే పొగ వల్ల గాలి కాలుష్యం జరుగుతుందని చెబుతున్నారు. కాలుష్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి నడక, సైకిల్, బస్సులు, రైళ్ల ద్వారా ప్రయాణం చేయాలని, ఆఫీసులకు వెళ్లే ఉద్యోగస్తులు కార్ పూలింగ్ ద్వారా వెళ్లాలని, పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలు కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తెలియజేస్తున్నారు.
మొక్కలు నాటించడం
పాఠశాల తనిఖీ, సందర్శనకు వచ్చే అధికారులతో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిస్తూ అందులో విద్యార్థులను భాగస్వామ్యం చేస్తున్నారు. పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో విద్యార్థులతో మొక్కల వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లినప్పుడు ప్రకృతి మొక్కల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు.
నీటి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న హెచ్‌ఎం రామకృష్ణ
నీటి వృథాను అరికట్టేలా..
నీటిని వృథా చేయకుండా ప్రతీ ఇంటిలోనూ వర్షాలు వచ్చినప్పుడు ఆ నీటిని మరలా వాడుకోవటానికి నీటిని నిల్వ చేసే నిర్మాణం, ఇంటిలో ఉన్న నల్లాల ద్వారా నీరు వృథా కాకుండా ఎలా చేసుకోవాలో తెలియజేస్తున్నారు. భూగర్భ జలాలను పెంచడానికి ఇంకుడు గుంతలు ఎలా నిర్మించాలో వివరిస్తున్నారు. పంట పొలాలు, తోటల్లో డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక టెక్నాలజీ ద్వారా వాటర్‌ను వాడుకోవాలని తెలిపారు.
తడి, పొడి చెత్త వేరు విధానం
రోజువారి ఇంటిలో నుంచి వెలువడే చెత్తలో ఉండే పేపర్లు, ప్లాస్టిక్, ఆర్గానిక్, ఎలక్ట్రానిక్ లాంటి వస్తువులను అంశాల వారీగా వేరు చేసి చెత్త బుట్టల్లో ఎలా వేయాలో తడి,పొడి చెత్త వేరు చేసే విధానాన్ని ప్రాక్టికల్ గా వివరిస్తున్నారు.

పర్యావరణం.. బోధన వినూత్నం

పర్యావరణం.. బోధన వినూత్నం