రామచంద్రాపురం(పటాన్‌చెరు): ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి కూలీ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని లింగపల్లి చౌరస్తాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన చంద్రప్ప(38) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తల్లి వెంకటమ్మ పది రోజుల కిందట తెల్లాపూర్‌లో నివాసముండే పెద్ద కుమారుడు అంజప్ప వద్దకు వచ్చింది. గత నెల 29న ఫోన్ చేసి నేను కూడా అన్న ఇంటి వద్దకు వస్తానని చెప్పాడు. గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో చంద్రప్ప లింగంపల్లి చౌరస్తాలో నూతనంగా నిర్మించి ఫ్లై ఓవర్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రప్ప కొంతకాలంగా అప్పులు చేసి తీర్చలేకపోవడం, ఒంటరితనం వల్ల మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి కంటే ముందు లింగంపల్లి చౌరస్తాలో వేగంగా వస్తున్న బస్సు ముందుకు చంద్రప్ప దూసుకుపోగా డ్రైవర్ బ్రైక్ వేసినట్లు స్థానికులు తెలిపారు. తర్వాత ఫ్లై ఓవర్‌పై నుంచి దూకినట్లు పేర్కొన్నారు.
మానసిక వేదనతో వ్యక్తి..
వర్గల్(గజ్వేల్): ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గౌరారం ఎస్‌ఐ కరుణాకర్‌రెడ్డి కథనం మేరకు.. వర్గల్‌కు చెందిన దాచ నాగరాజు(34)కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయి గురువారం ఉదయం పెంట్ హౌజ్ రేకుల షెడ్‌లో స్నానం చేసి వస్తానని వెళ్లాడు. అక్కడే పైపునకు ఉరేసుకొని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కుటుంబ కలహాలతో ఉరేసుకొని
హత్నూర (సంగారెడ్డి): కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హత్నూర మండలం మంగాపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంగాపూర్ గ్రామానికి చెందిన మాదారం దుర్గయ్య (36) అతడి తమ్ముడు ఆగు భాస్కర్ కుటుంబీకులు వేర్వేరుగా ఉంటున్నారు. అయినప్పటికీ తరచూ ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. బుధవారం దుర్గయ్య –భాస్కర్ కుటుంబాలు వాగ్వాదానికి దిగాయి. గ్రామ పెద్దలు మాట్లాడి ఇరువురికి నచ్చజెప్పారు. గురువారం గ్రామ శివారులోనే ఓ వ్యవసాయ పొలం వద్ద వెళ్లిన దుర్గయ్య చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్థానికులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుభాష్ తెలిపారు.