
100 శాతం పరిష్కారం
● భూభారతితో రైతులకు మేలు ● అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించం ● ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ ● చట్టంలో కొన్ని సవరణలు చేయాలి ● ఎంపీ రఘునందన్ రావు
హత్నూర(సంగారెడ్డి): భూ సమస్యల పరిష్కారం విషయంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చరించారు. సోమవారం హత్నూర మండలం దౌల్తాబాద్‌లో భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. కేసీఆర్ తెచ్చిన ధరణి వల్ల ఎంతో మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని, వంద శాతం భూముల సమస్యల పరిష్కారం కోసం ఈ చట్టం పనిచేస్తుందన్నారు. భూదాన్ చట్టం కూడా సరిచేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంన్నారు. ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ.. భూభారతి చట్టంలో కొన్ని సవరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. భూదాన్ చట్టాన్ని మరింత పటిష్టంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ అధికారులు కృషి చేయాలన్నారు. దేశంలోని సివిల్ కోర్టుల వద్ద ఐదువేల కోట్ల కేసులు పెండింగ్‌లో ఉంటే మూడు వేల కోట్ల కేసులు భూ సమస్యలే ఉన్నాయని ఎంపీ గుర్తు చేశారు. క్షేత్రస్థాయిలో భూ సమస్యలు పరిష్కరిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. ఐదు లక్షల విలువ ఉన్న భూమి సమస్యలను ఆర్డీఓ స్థాయిలోనే పరిష్కారం అవుతుందన్నారు. ఉచిత న్యాయ సేవ కూడా రెవెన్యూ శాఖ ద్వారా రైతులకు అందిస్తామన్నారు.
తహసీల్దార్ కార్యాలయం
నిర్మాణానికి శంకుస్థాపన
మండల కేంద్రమైన హత్నూరలో తహసీల్దార్ నూతన భవన నిర్మాణం పనులకు మంత్రి కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. హత్నూర అంబేద్కర్ గురుకుల కళాశాలలో రూ.63 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీరోడ్లు, రూ.2కోట్లతో నిర్మించిన డార్మెటరీ భవనాన్ని ప్రారంభించారు. కార్యక్రమాలలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీజీఐసీ చైర్మన్ నిర్మలారెడ్డి, అదనపు కలెక్టర్ మాధురి, మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సువాసిని రెడ్డి, ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ పర్వీన్ షేక్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మధుసూదన్, కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
పదేళ్లు సొల్లు కబుర్లు చెప్పావా?
అసెంబ్లీ సమావేశాలను సొల్లు కబుర్లు అని సంబోధించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంటనే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు చేశారని విమర్శించారు. అసెంబ్లీని కించపరిచిన కేసీఆర్.. మరి పదేళ్ల మీ పాలనలో సొల్లు కబుర్లు చెప్పారా అంటూ నిలదీశారు. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.