
అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
కొండపాక(గజ్వేల్): అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఆత్మహత్మకు పాల్పడిన ఘటన దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది. త్రీ టౌన్ పోలీసుల కథనం మేరకు.. పోలీస్‌స్టేషన్ పరిధిలోని దుద్దెడకు చెందిన రొడ్డ మల్లేశం (31)టాటా ఏస్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గతనెల 30న వాహనం పంక్చరైందని ఇంట్లో చెప్పి వెళ్లి రాత్రి వరకు రాలేదు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. కుటుంబీకులు బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. అదే రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో చిన్నాన్న వ్యవసాయ బావి వద్ద మల్లేశం చెట్టుకు ఉరేసుకున్నాడని విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటినా వెళ్లారు. వాహనం సరిగా నడవక కుటుంబ పోషణ కోసం సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడని, అవి తీర్చే మార్గంలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
నానమ్మ మందలించిందని యువకుడు
నిజాంపేట(మెదక్): ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మండల కేంద్రానికి చెందిన కమ్మరి కమలమ్మ మనువడు కమ్మరి నర్సింలు(20) తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో నానమ్మ వద్దే ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో ఆమెకి వయస్సు మీద పడటంతో తాను పని చేయలేక పోతున్నానని, నిన్ను పెంచడం నాతో కాదని, నీవు ఏదైనా పని చేసుకొని బతకాలని మందలించింది. దీంతో మనస్తాపం చెంది క్షణికావేశంలో ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు చనిపోయే ముందు ఇన్‌స్టా గ్రామ్‌లో ‘నేను చనిపోయాక అయినా నా విలువ తెలుస్తుందో ఏమో’ అని రీల్ పెట్టి బలవన్మరణానికి పాల్పడాడు. మృతుడి నానమ్మ కమలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.