
పదికి పకడ్బందీ ఏర్పాట్లు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: ఈ నెల 21వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ప్రశాంతమైన వాతావరణంలో రాసేందుకు జిల్లా విద్యాశాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఐదు నిమిషాల సడలింపు అమలులో ఉంది. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. ప్రతి పరీక్ష కేంద్రం అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక చికిత్స అందించేందుకు మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు. తాగు నీటి సమస్య లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో 22,423 మంది విద్యార్థులు
జిల్లాలో 22,423 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలలో రెగ్యులర్ విద్యార్థులు 22,411 కాగా ప్రైవేట్ విద్యార్థులు (గతంలో ఫెయిల్ అయిన విద్యార్థులు) 12 మంది ఉన్నారు. జిల్లాలో 122 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకై ఏదైనా సమాచారం, సందేహాలపై జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే 08455–276255, 8979677495ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. దీంతో పాటు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సంబంధిత మండల విద్యాదికారి, జిల్లా విద్యాధికారి, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల వైద్యశాఖ అధికారి మొబైల్ నంబర్లు డిస్‌ప్లే చేయాలని సంబంధిత చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎట్టి పరిస్థితులలో మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లతో పాటు ఇతర ఏ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించరు.
● విద్యార్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.
● హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్, రైటింగ్‌ప్యాడ్‌ను వెంట తీసుకొని రావాలి
● హాల్ టికెట్ అందని, పోగొట్టుకున్న విద్యార్థులు www.bre.teanfana.gov.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి
● పరీక్ష రాసేందుకు వచ్చే విద్యార్థులు తమ పాఠశాల యూనిఫాంలో కాకుండా ఇతర దుస్తువులో హాజరు కావాలి.
రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు..
ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి
పరీక్షలు రాసేందుకు సంసిద్ధమవుతున్న విద్యార్థులకు ముందుగా బెస్ట్ ఆఫ్ లక్. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు పాల్పడే అవకాశం లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఒక్కో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారితో పాటు సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించాం. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి.
– వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి

పదికి పకడ్బందీ ఏర్పాట్లు