
మాట్లాడుతున్న బండి సంజయ్
● అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం ● జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం నిధులే.. ● బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్
హుస్నాబాద్: నిధులు కేంద్రానివి.. సోకు కేసీఆర్‌ది లా మారిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మంగళవారం ఆయన బీజేపీ అభ్యర్థి శ్రీరాంచక్రవర్తితో కలిసి హుస్నాబాద్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఇటీవల హుస్నాబాద్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణ పనులకు త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారని, ఈ పనులకు కేంద్రం ఎప్పుడో రూ.578 కోట్లు మంజూరు చేసిందని, పనులు కూడా శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. కేసీఆర్ కావాలనే అబద్దపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. హుస్నాబాద్‌లో సీసీ రోడ్లతో పాటు పేదలకు రేషన్ బియ్యం, వీధి దీపాలు సహా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి నిధులన్నీ కేంద్రానివే అని తెలిపారు. ఎంపీగా తాను కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకొస్తే ఆయన కొబ్బరి కాయలు కొట్టి నాటకమాడుతున్నారన్నారు. ఉచిత రేషన్ బియ్యం, సడక్ యోజన కింద రహదారులు, జాతీయ రహదారులు, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, కమ్యూనిటీ భవనాలు, ట్రాక్టర్లు ఇచ్చే నిధులు కూడా కేంద్రానివేనని బండి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 2.40లక్షలు ఇళ్లు ఇచ్చిందని, ఆ ఇళ్లు ఏమయ్యాయని అన్నారు. నిరుద్యోగులకు ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. నిరుద్యోగులు కష్టపడి చదివి కోచింగ్ తీసుకొని ఏళ్ల తరబడి ఉద్యోగాలు లేక అల్లాడుతుంటే వారి పక్షాన నిలిచి పోరాడనన్నారు.