
పాత వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తే చాలా ప్రయోజనం
44 నగరాల్లో ఈవీలు వస్తే ఆర్థికంగా, పర్యావరణ పరంగా ఎంతో మేలు
61 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను అరికట్టే అవకాశం
2035 నాటికి 51 బిలియన్ లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్ ఆదా
ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా ఇంధన వనరులు దొరకడం లేదు. ఇప్పుడున్న వనరులు కూడా కొన్నేళ్లకు తరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు ఇంధన వనరులతోపాటు స్వచ్ఛమైన వాతావరణాన్ని కూడా అందించడం కోసం ప్రపంచ దేశాలు ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
పాత వాహనాలను వదిలేసి విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని పెంచడం ద్వారా ఆయా దేశాలు, ముఖ్యంగా మన దేశం లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్(టీఈఆర్‌ఐ) తాజాగా నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో 10 లక్షల మంది, అంతకన్నా ఎక్కువ జనాభా గల నగరాలు 44 ఉన్నాయి. ఈ నగరాల్లో పాత వాహనాల స్థానంలో ఈవీలను ఉపయోగించడం వల్ల 2035 నాటికి విదేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్న చమురు ఖర్చులో రూ.9.17 లక్షల కోట్లను తగ్గించవచ్చని టీఈఆర్‌ఐ నివేదిక స్పష్టం చేసింది.
⇒ 49 లక్షలు: దేశంలో 2024 నాటికి 10 లక్షలు జనాభా గల 44 నగరాల్లో ఉన్న పాత వాహనాలు. 2030 నాటికి ఈ సంఖ్య 75లక్షలకు పెరుగుతుంది
⇒37 శాతం: నగరాల్లో వాయు కాలుష్యంలో పాత వాహనాల నుంచి వచ్చే వాటా
⇒రూ.9.17 లక్షల కోట్లు: 44 నగరాల్లో పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకొస్తే 2035 నాటికి తగ్గనున్న ఇంధన దిగుమతి ఖర్చు
⇒ 3.7 లక్షలు: పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకురావడం వల్ల 2035 నాటికి లభించే కొత్త ఉద్యోగాలు
టీఈఆర్‌ఐ అధ్యయనం ఇంకా ఏం చెప్పిందంటే...
⇒ మన దేశంలోని పెద్ద నగరాల్లో వాయు కాలుష్యానికి పాత వాహనాలు ప్రధాన కారణమవుతున్నాయి. నగరాల్లోని వాయు కాలుష్యంలో పాత వాహనాల వాటా 37 శాతం. నగరాల్లో 2035 నాటికి పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకురావడం వల్ల కర్బన ఉద్గారాలు బాగా తగ్గుతాయి. గాలి నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుంది.
⇒ కనీసం 10 లక్షల జనాభా గల 44 నగరాల్లో 2024లో పాత వాహనాల సంఖ్య 4.9 మిలియన్ (49 లక్షలు). ఆ సంఖ్య 2030 నాటికి 7.5 మిలియన్ (75 లక్షలు)కు పెరుగుతుంది.
⇒ ఈ నగరాల్లోని పాత వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మారడం వల్ల 2035 నాటికి రోజూ 11.5 టన్నుల (పరి్టక్యులర్ మీటర్ 2.5) వాయు కాలుష్య కణాలను నివారించవచ్చు. 61 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చు.
⇒ 2035 నాటికి 51 బిలియన్ లీటర్లకు పైగా పెట్రోల్, డీజిల్ ఆదా అవుతుంది. చమురు దిగుమతి ఖర్చు రూ.9.17 లక్షల కోట్లు మిగులుతుంది.
⇒ ముఖ్యంగా పాత డీజిల్ బస్సులు అతిపెద్ద కాలుష్య కారకాలని టీఈఆర్‌ఐ అధ్యయనం తెలిపింది. పాత బస్సులను నిలిపేస్తే పీఎం 2.5 ఉద్గారాలు 50శాతం, నైట్రోజన్ ఆక్సైడ్ ఉద్గారాలు 80శాతం తగ్గే అవకాశం ఉంది.
⇒ పాత వాహనాల స్థానంలో ఈవీలను తీసుకొచ్చేందుకు 44 నగరాల్లో 45వేల కంటే ఎక్కువ పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్లు, 130 వాహన స్క్రాపింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి.
⇒ పాత వాహనాల్లో సగం సీఎన్‌జీకి మార్చితే సుమారు 2,655 కొత్త సీఎన్‌జీ స్టేషన్లు అవసరమవుతాయి.
⇒ ఈ విధంగా చేస్తే 2035 నాటికి విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో దాదాపు 3.7 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించవచ్చు.