
డీజిల్‌కు స్వస్తి పలికిన రైల్వే
దక్షిణ మధ్య రైల్వేలో 100% విద్యుదీకరణ
అక్కన్నపేట–మెదక్ పనుల పూర్తితో సాధన
దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు డివిజన్లో పూర్తి
తెలుగు రాష్ట్రాల్లో విద్యుదీకరణ సంపూర్ణం
రైల్వేకు తగ్గిన ‘చేతి చమురు’
కి.మీ.కు రూ.270 చొప్పున ఆదా
తగ్గిన వ్యయం, పర్యావరణ ప్రియం
తెలుగు రాష్ట్రాల్లో పొగబండిని ఇక పొగరాని బండి అని పిలవాలి. ఎందుకంటే.. దేశంలో డీజిల్ రైలింజిన్లకు స్వస్తి చెబుతూ కేవలం కరెంటు ఇంజిన్లతోనే రైళ్లు నడపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే విజయవంతంగా ఆచరణలోకి తెచ్చిం ది. 2025 మార్చి నాటికి 100% లైన్లను విద్యుదీకరించాలన్న లక్ష్యాన్ని సాధించింది. దేశవ్యాప్తంగా 97% సాధించగా, దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపింది. మరోపక్క వాల్తేర్ డివిజన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాంతాల్లోనూ ఇప్పటికే విద్యుదీకరణ పూర్తయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎలక్ట్రిక్ ఇంజిన్లతోనే రైళ్లను నడిపే పరిస్థితి ఏర్పడింది. దీన్ని రైల్వేలో భారీ విజయంగా భావిస్తున్నారు. డీజిల్ ఇంజిన్ల వల్ల రైల్వే శాఖకు భారీగా చేతి‘చమురు’వదులుతోంది. లైన్ల విద్యుదీకరణ ద్వారా, డీజిల్ భారాన్ని తగ్గించుకుని ఆ మొత్తాన్ని రైల్వేల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఖర్చు చేస్తోంది. దేశవ్యాప్తంగా 97% విద్యుదీకరణ సాధించగా, దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా సాధించి చూపింది. కర్ణాటక (96%), తమిళనాడు (96%), రాజస్తాన్ (98%) వంటి రాష్ట్రాల్లో ఇంకా పూర్తి కాలేదు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు విద్యుదీకరణ పూర్తయిన రైల్వే ట్రాక్ నిడివి 68,730 కిలోమీటర్లు. ఇందులో గత పదేళ్లలో పూర్తయింది 46,928 కిలోమీటర్లు. – సాక్షి, హైదరాబాద్
జోన్‌పరిధిలో ఇలా..
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 6,609 రూట్ కి.మీ. మేర రైలు మార్గాలున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రం పరిధిలో 2,015 రూట్ కి.మీ.ల ట్రాక్ ఉంది. వాల్తేర్ డివిజన్ పరిధిలో సుమారు 1,075 రూట్ కి.మీ. మేర ఉంటే.. ఇందులో ఏపీ పరిధిలో దాదాపు 545 కి.మీ.ల ట్రాక్ ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్కన్నపేట–మెదక్ మధ్య 17 కి.మీ. మేర పనులు అసంపూర్తిగా ఉండిపోయాయి. వాటిని వేగంగా నిర్వహించి విద్యుత్తు రైళ్లు నడపడం ప్రారంభించారు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే యావత్ దక్షిణ మధ్య రైల్వేలో విద్యుదీకరణ పూర్తయినట్టు తేల్చారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1,280 విద్యుత్తు లోకోమోటివ్‌లు వినియోగిస్తున్నారు. వీటిలో 291 ఇంజిన్లను ప్రయాణికుల రైళ్లకు వాడుతుండగా, మిగతావాటిని సరుకు రవాణా రైళ్లకు వినియోగిస్తున్నారు. ఇక జోన్‌పరిధిలోనే ఉన్నప్పటికీ, కర్ణాటక రాష్ట్రంలోని బీదర్–గుల్బర్గా పరిధిలోకి వచ్చే ఖానాపూర్–కమలాపూర్–నందగావ్ మార్గంలో కొంతమేర పని మిగిలి ఉంది. అయితే, దాన్ని నిర్వహించే బాధ్యత దక్షిణ మధ్య రైల్వే సరిహద్దుతో ఉన్న సెంట్రల్ రైల్వేది. ఫలితంగా దక్షిణ మధ్య రైల్వే రికార్డు సమయంలో లక్ష్యాన్ని సాధించినట్టయింది.
ఇంకా డీజిల్ ఇంజిన్లు.. ఎందుకంటే?
వంద శాతం విద్యుదీకరణ జరిగినప్పటికీ, దక్షిణ మధ్య రైల్వే జోన్‌పరిధిలో ఇప్పటికీ 395 డీజిల్ ఇంజిన్లను నిర్వహిస్తున్నారు. వీటిలో 245 ఇంజిన్లను సరుకు రవాణా రైళ్లకు వాడుతున్నారు. అలాగే వాల్తేర్ డివిజన్లో మొత్తం 387 ఇంజిన్లు ఉంటే అందులో డీజిల్ ఇంజిన్లు 162. భవిష్యత్తులో రైళ్లు ఢీకొనటం, వరదలు లాంటి విపత్తులతో విద్యుత్తు సరఫరా వ్యవస్థ దెబ్బతిని కరెంటు ఇంజిన్లు వాడలేని పరిస్థితి ఎదురైతే, అత్యవసర సేవల కోసం ఈ డీజిల్ ఇంజిన్లతో రైళ్లు నడుపుతారు. ఆ సమయంలో డీజిల్ ఇంజిన్లు ఫిట్‌గా ఉండాలంటే వాటిని నిరంతరం వాడాలి.
ఇక మిగిలిందదే..
తెలంగాణ పరిధిలో ప్రస్తుతం ఒకే ఒక్క కొత్త రైలు మార్గం పనులు జరుగుతున్నాయి. మేడ్చల్ సమీపంలోని మనోహరాబాద్ నుంచి మొదలై కరీంనగర్ శివారులో కొత్తపల్లి వరకు సాగే లైను. ఇందులో సిద్దిపేట వరకు ట్రాక్ ఏర్పాటు పూర్తి కావటంతో రైలు సేవలు కూడా మొదలయ్యాయి. సిద్దిపేట నుంచి సిరిసిల్ల మీదుగా పైకి కొనసాగాల్సి ఉంది. ఈ పనులు 2026 నాటికి పూర్తవుతాయి. ఇంతకాలం కొత్త లైన్ల నిర్మాణాన్ని ముందు చేపట్టి, భవిష్యత్తులో కుదిరినప్పుడు మార్గాన్ని విద్యుదీకరించేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి, కొత్త లైన్ల పనులు జరుగుతున్న సమయంలోనే సమాంతరంగా విద్యుదీకరణ పనులూ నిర్వహిస్తున్నారు.
ఈమేరకు మనోహరాబాద్–కొత్తపల్లి మార్గాన్ని కూడా విద్యుదీకరించాలని నిర్ణయించింది. 2026 జూన్‌నాటికి దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది పనులు జరుగుతున్న ప్రాజెక్టు కావడంతో దీన్ని విద్యుదీకరణ జాబితాలో చేర్చలేదు. అసంపూర్తి ప్రాజెక్టు కావటంతో దీన్ని విద్యుదీకరణ జరగని ప్రాజెక్టుగా తేల్చలేదు. ఫలితంగా వంద శాతం విద్యుదీకరణ సాధించిన జోన్‌గా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను రైల్వే శాఖ ప్రకటించింది.
డీజిల్‌తో రూ.400 కరెంటుతో రూ.130 మాత్రమే
డీజిల్ ఇంజిన్‌నడపడం వల్ల రైల్వేకు ఒక కి.మీ.కు అయ్యే వ్యయం సగటున రూ.400. అదే కరెంటు ఇంజిన్‌కి.మీ.కు 20 యూనిట్ల కరెంటును ఖర్చు చేస్తుంది. ఈ రూపంలో అయ్యే వ్యయం సగటున రూ.130 మాత్రమే. సరుకు రవాణా రైలు నిర్వహణలో డీజిల్‌తో పోలిస్తే కరెంటు ఇంజిన్‌కు మూడో వంతు వ్యయం, ప్రయాణికుల రైలుకు నాలుగో వంతు వ్యయం అవుతుందని అంచనా.
రైల్వే శాఖ లెక్కల ప్రకారం.. 2018–19లో రైల్వే శాఖ డీజిల్ రూపంలో చేసిన ఖర్చు రూ.18,587 కోట్లు. విద్యుదీకరణతో ఏటా రూ.1,000 కోట్లకు పైగా మొత్తాన్ని ఆదా చేస్తోంది. గత పదేళ్లలో విద్యుదీకరణ వల్ల దాదాపు 640 కోట్ల లీటర్ల డీజిల్‌ను ఆదా చేసిందని నివేదికలు చెబుతున్నాయి. దీనివల్ల 400 కోట్ల కేజీల కర్బన ఉద్గారాల విడుదలను నివారించగలిగాం.