
డాల్ఫిన్‌ల శబ్దాలకు అర్థాలు వెతుకుతున్న గూగుల్!
స్వరాలు, ప్రవర్తనల డేటా సేకరణకు ‘డాల్ఫిన్ జెమ్మా’
డాల్ఫిన్‌లతో మాటామాటా కలిపిన ఏఐ మోడల్
మిగతా జీవులపైనా జరుగుతున్న ఏఐ అధ్యయనాలు
పరిశోధనలు ఫలిస్తే మూగజీవాలకు ‘మాటలొచ్చినట్లే’!
డాల్ఫిన్లు వివిధ రకాలైన వింత శబ్దాలను చేస్తాయి. జంతువుల్లా అరుస్తాయి. పక్షుల్లా కూస్తాయి. మనుషుల్లా మూలుగుతాయి. ఈలలు వేస్తాయి. కిచకిచమంటాయి. పకపకమంటాయి. పెద్ద బుడగ పగిలినట్లుగా ధడేల్మంటాయి. అవి ఉన్న పరిస్థితిని బట్టి, తమ ప్రవృత్తిని, ప్రకోపాన్ని అనుసరించి విభిన్నమైన ధ్వనులతో తమలో తాము సంభాషించుకుంటాయి! ఆ సంభాషణలకు, లేదా వాటి ధ్వనులకు అర్థం ఏమై ఉంటుంది? అది తెలుసుకోటానికే... ‘డాల్ఫిన్ జెమ్మా’ అనే డాల్ఫిన్ ఏఐ మోడల్‌ను (సాఫ్ట్‌వేర్‌ను) భుజాన వేసుకుని ‘గూగుల్’ సముద్ర పరిశోధనలు చేస్తోంది! డాల్ఫిన్‌లతో మాటలు కలపటానికి వాటి అరుపులను అనుకరిస్తోంది. ఆ అరుపుల అర్థాలను డీకోడ్ చేయవచ్చని భావిస్తోంది. అయితే, ఏఐ సహాయంతో మనిషి ఏనాటికైనా మానవేతర జీవుల మనసును పసిగట్టగలడా? కృత్రిమ మేధ, మానవ అంతర్‌దృష్టిని దాటి లోలోపలికి చూడగలదా అన్నదే పెద్ద ప్రశ్న. -సాక్షి, స్పెషల్ డెస్క్
ఏమిటీ ‘డాల్ఫిన్ ఏఐ మోడల్’
డాల్ఫిన్లు కూడా మనుషుల్లాగే సామాజిక నైపుణ్యం కలిగినవి. చెప్పాలంటే తెలివైనవి, చురుకైనవి కూడా. మచ్చికైన మనుషులతో భావోద్వేగాలను కూడా పంచుకుంటాయి! అలాగే ఇతర జంతువులు కూడా. బ్రిటిష్ మహిళా ఎథాలజిస్ట్ (మానవేతర జంతు ప్రవర్తనల అధ్యయన శాస్త్రవేత్త) జేన్ గుడాల్ అడవి చింపాంజీల సామాజిక కుటుంబ పరస్పర పరిశోధనలను చేసిన విధంగానే, ప్రముఖ మహిళా పరిశోధకురాలు డెనిస్ హెర్జింగ్ 1985 నుండే డాల్ఫిన్ కమ్యూనికేషన్ మీద అధ్యయనం చేస్తున్నారు.
‘ది వైల్డ్ డాల్ఫిన్ ప్రాజెక్ట్’ (డబ్లు్య.డి.పి.) అనే ప్రతిష్టాత్మకమైన భారీ సముద్ర గర్భ ప్రాజెక్టులో తలమునకలై ఉన్నారు. గూగుల్ ఇప్పుడు ఆ డబ్లు్య.డి.పి. ప్రాజెక్టుతో, జార్జియా టెక్ యూనివర్సిటీతో కలిసి డాల్ఫిన్‌ల స్వర నమూనాలను విశ్లేషించడానికి, వాటి నిర్మాణాన్ని గుర్తించడానికి తొలిసారి ‘డాల్ఫిన్ ఏఐ మోడల్’తో ప్రయోగాలు తలపెట్టింది.
ఇది ఎలా పని చేస్తుందంటే..
డాల్ఫిన్లు భిన్న సామాజిక, పరిసర పరిస్థితులకు భిన్న శబ్దాలను చేస్తాయి. ముఖ్యంగా తల్లులు, పిల్లల మధ్య వ్యక్తిగత గుర్తింపు కోసం ఈలలు వేస్తాయి. ఘర్షణ పడుతున్నప్పుడు ‘క్కే క్కే’ మంటాయి. ప్రేమలో ఉన్నప్పుడు / సహజీవనం చేస్తున్నప్పుడు చేగోడీలు కొరికితే వచ్చే చప్పుడును చేస్తాయి. ఈ శబ్దాలను విని ఫీడ్ చేసుకునేందుకు, ప్రతిస్పందన శబ్దాలు చేసేందుకు పిక్సెల్ 6 స్మార్ట్‌ఫోన్ లపై పనిచేసే ‘డాల్ఫిన్ జెమ్మా’ను గూగుల్.. బహమాస్ ద్వీపంలో కలియ తిప్పుతోంది. డబ్లు్య.డి.పి. నుంచి వచ్చిన డేటాతో ఆడియో సాంకేతికతను మిళితం చేయటం ద్వారా గూగుల్ డాల్ఫిన్ ఏఐ మోడల్.. జల గర్భంలోని డాల్ఫిన్‌ల శబ్దాలను డీకోడ్ చేస్తుంది. ఏప్రిల్ 14న ‘జాతీయ డాల్ఫిన్ దినోత్సవం’ నాడు, గూగుల్ తన డాల్ఫిన్ ఏఐ నమూనా పురోగతిని ప్రదర్శించింది. ఫలితం ఏంటంటే – అది ఎంతో చక్కగా డాల్ఫిన్ స్వర నమూనాలను విశ్లేషిస్తోంది. నిజమైన డాల్ఫిన్ లాంటి శబ్దాలను సైతం తనే ఉత్పత్తి చేస్తోంది.
ఏఐ ప్రయోగం.. ఏమిటి ప్రయోజనం?
అంతరించిపోతున్న జీవ జాతులను పర్యవేక్షించడం ద్వారా వాటి పరిరక్షణకు ఏఐ మోడల్ సహాయపడుతుంది. ఇక డీకోడింగ్ కమ్యూనికేషన్ అన్నది జీవజాతుల పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యాన్ని వెల్లడిస్తుంది. కాలుష్యం, వాతావరణ మార్పుల గురించి మానవుల్ని హెచ్చరిస్తుంది. ఏఐ మానవులు – మూగ జీవుల మధ్య పరస్పర సాహచర్యాన్ని పెంచుతుంది, సహానుభూతిని పెంపొందిస్తుంది.
అన్ని జంతువులపైనా ఏఐ పరిశోధనలు
చిలుకలు, కాకులు, తోడేళ్లు, తిమింగలాలు, చింపాంజీలు, ఆక్టోపస్‌లు ఎలా సంభాషిస్తాయో గుర్తించడానికి కూడా ఇప్పుడు ఏఐ ఉపయోగపడుతోంది. ‘నేచురల్ ఎల్.ఎం. ఆడియో’ అనేది జంతువుల శబ్దాల కోసం నిర్మించిన మొట్టమొదటి ఆడియో–భాషా నమూనా. దీని ద్వారా ఇంతవరకు కనిపించని జాతుల శబ్దాలను సైతం విశ్లేషించవచ్చు. మరికొన్ని ప్రాజెక్టుల ద్వారా స్పెర్మ్ వేల్ వెలువరించే ధ్వనుల అర్థాలను కనిపెట్టటానికి ఏఐని, రోబోటిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. అలాగే జంతువుల లైంగిక ప్రవర్తనలను అంచనా వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఉపగ్రహ చిత్రాలు, కెమెరా ట్రాప్‌లు, బయో అకౌస్టిక్‌ల అనుసంధానం కలిగి ఉన్న ఏఐను పక్షుల సంరక్షణకు, పర్యవేక్షణకు, అమెజాన్ ప్రాంత రక్షణకు ఉపయోగిస్తున్నారు. కొలంబియాలోని యూనివర్సిడాడ్ డి లాస్ ఆండీస్, ఇన్ స్టిట్యూటో సించి, ఇన్ స్టిట్యూటో హంబోల్ట్, ప్లానెట్ ల్యాబ్స్, మైక్రోసాఫ్ట్ ఏఐ ఫర్ గుడ్ ల్యాబ్‌ల సహకారంతో ఈ ప్రాజెక్టు నడుస్తోంది.
కృత్రిమ మేధకూ పరిమితులు
కృత్రిమ మేధ జంతువుల ధ్వని నమూనాలను గుర్తించగలదు, కానీ అనూహ్యంగా జరిగే జంతువుల అకాల సంభోగం, వేళకాని వేళ అవి ఆహారం తీసుకోవటం లేదా ఏదైనా ప్రమాదంలో అవి చేసే ధ్వనులను గుర్తించటంలో కృత్రిమ మేధకు పరిమితులు ఉంటాయి. జంతువులు మానవుల మాదిరిగానే ‘మాట్లాడుకుంటాయి’ అనేది పొరపాటు భావన అయినప్పుడు, క్షేత్రస్థాయి వివరాలు చిక్కుముడిగా లభ్యం అవుతున్నప్పుడు కూడా జీవజాతుల–నిర్దిష్ట ప్రవర్తనల విశ్లేషణ ఏఐకి క్లిష్టతరం అవుతుంది. చాలాసార్లు మానవ అంతర్‌దృష్టి జోడింపు అవసరం కావచ్చు. పైగా ఇలాంటి అధ్యయనాలకు తరచుగా కస్టమ్ మోడళ్లు, విస్తృతమైన వనరులు అవసరమవుతాయి. దాంతో జంతువుల కమ్యూనికేషన్ అన్నది డీకోడింగ్‌ను సంక్లిష్టమైన ప్రయత్నంగా మారుస్తుంది.