లిజ్‌ ట్రస్‌ 45 రోజులు, కానీ, అతితక్కువ కాలం పదవుల్లో కొనసాగింది వీళ్లే!

Did You Know These World Leaders Crown Holders Serve Shortest Time - Sakshi

బ్రిటన్‌ ప్రధాని పదవికి లిజ్‌ ట్రస్‌ రాజీనామా చేయడం.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఆరేళ్లలో నలుగురు ప్రధానులు మారడం.. యూకేలోని రాజకీయ అస్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. అయితే పాలనాపరమైన నిర్ణయాలు దారుణంగా బెడిసి కొట్టడం.. సొంత పార్టీ నుంచే ప్రతికూలత నడుమ కేవలం 45 రోజులకే ట్రస్‌ ఆ పదవికి రాజీనామా చేయడం ఇక్కడ గమనార్హం. ఈ తరుణంలో.. ట్రస్‌ రాజీనామాపై సెటైర్లు సైతం పేలుతున్నాయి. ఇక ప్రపంచంలో అత్యంత తక్కువ కాలం పదవిలో కొనసాగిన కొందరి నేపథ్యాన్ని ఓసారి పరిశీలిద్దాం.. 

లిజ్‌ ట్రస్‌.. బ్రిటన్‌ అధికారిక కన్జర్వేటివ్‌ పార్టీ ఎంపీల మద్దతుతో.. సెప్టెంబర్‌ 6వ తేదీన బ్రిటన్‌ రాణి క్వీన్‌ ఎలిజబెత్‌ సమక్షంలో ప్రధాని పగ్గాలు చేపట్టారు లిజ్‌ ట్రస్‌. కానీ.. ఆర్థిక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొని చివరకు 45 రోజుల తర్వాత డౌనింగ్‌ స్ట్రీట్‌ను వీడుతూ ఆమె తన రాజీనామాను ప్రకటించారు.

 

బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా లిజ్ ట్రస్ రికార్డులకెక్కారు. అంతకు ముందు ఆ రికార్డు జార్జ్ కానింగ్ (119 రోజులు) పేరిట ఉండేది. క్షయ వ్యాధి బారినపడి ఆగస్టు 8వ తేదీన, 1827లో ఆయన మరణించారు. 

► అటల్‌ బిహారీ వాజ్‌పేయి.. 16 రోజులు దేశ ప్రధాని పదవిలో కొనసాగారు. మే 16, నుంచి జూన్‌ 1వ తేదీ దాకా.. విశ్వాస పరీక్ష తీర్మానం నేపథ్యంలో ప్రధాని పదవి నుంచి స్వచ్ఛందంగా దిగిపోయి రాజకీయాల్లో తనదైన నిజాయితీ ప్రదర్శించారనే ముద్ర వేసుకున్నారాయన. 

► వాజ్‌పేయి కంటే ముందు.. గుల్జారీలాల్‌ నందా ఆపద్ధర్మ ప్రధానిగా కేవలం పదమూడు రోజులపాటు.. అదీ రెండు పర్యాయాలు కొనసాగారు. మొదటిసారి నెహ్రూ మరణం తర్వాత, రెండోసారి లాల్‌ బహదూర్‌ శాస్త్రి మరణం తర్వాత గుల్జారీలాల్‌ నందా ప్రధాని పదవిలో కొనసాగారు. 

గుల్జారీలాల్‌ నందా మధ్యలో..

ప్రమాణం చేసిన గంటకే.. 

1967లో సియెర్రా లియోన్‌ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సియాకా స్టీవెన్స్‌ ప్రధాని అయ్యారు. కానీ, పాపం గంటకే ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. మిలిటరీ తిరుగుబాటుతో ప్రమాణం చేసిన గంటకే ఆయన్ని అరెస్ట్‌ చేసి కారాగారానికి పంపారు.  

అయితే.. తన మార్క్‌ రాజకీయంతో జైలు నుంచే చక్రం తిప్పిన ఆయన.. రెండువారాలకు మిలిటరీ తిరుగుబాటును అణచివేయగలిగారు. బయటకు వచ్చి మళ్లీ ప్రధాని పదవి చేపట్టి.. పదిహేడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. 

అధ్యక్షులు కూడా.. 

 అమెరికా ఆర్మీ అధికారి, ఆ దేశానికి తొమ్మిదవ అధ్యక్షుడు అయిన విలియం హెన్రీ హ్యారీసన్‌.. కేవలం 32 రోజులపాటు మాత్రమే పదవిలో కొనసాగారు. ఊపిరితిత్తుల సమస్యతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. పదవిలో ఉండగా మరణించిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా హ్యారీసన్‌ కావడం గమనార్హం. 

మెక్సికో అధ్యక్షుడు పెడ్రో లాస్కురెయిన్‌.. 1913లో కనీసం గంటపాటు కూడా పదవిలో కొనసాగలేదు. జనరల్‌ విక్టోరియానో హ్యూయెర్టో సారధ్యంలో జరిగిన మిలిటరీ తిరుగుబాటుతో పగ్గాలు చేపట్టిన 45 నిమిషాలకే పెడ్రో తన పదవి కోల్పోయారు. 

► 1945, ఏప్రిల్‌ 30 జర్మనీ మాత్రమే కాదు.. ప్రపంచ చరిత్రలో గుర్తుండిపోయే రోజు. అడాల్ఫ్‌ హిట్లర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం.. నాజీ జర్మనీలో  జోసెఫ్‌ గోయెబ్బెల్స్‌  ఛాన్స్‌లర్‌ పగ్గాలు చేపట్టారు. అయితే.. ఆయన జర్మనీ చాన్స్‌లర్‌గా కొనసాగింది ఆ ఒక్క రాత్రి మాత్రమే. ఉదయం కల్లా భార్య మాగ్దా, తన ఆరుగురు పిల్లలతో గోయెబ్బెల్స్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

రాజులు.. రాణులు కూడా!

 అధినేతల విషయంలోనే కాదు.. రాజరికంలోనూ అత్యంత తక్కువ కాలం సింహాసనం మీద కూర్చున్నవాళ్ల రికార్డులు ఉన్నాయి. ఫ్రాన్స్‌ రాజుగా లూయిస్‌ 19.. 1803లో కేవలం ఇరవై నిమిషాలపాటు మాత్రమే సింహాసనం మీద కూర్చున్నారు. చాలాకాలం ఆయన ఫ్రాన్స్‌కు దూరంగా గడిపారు. 

► పోర్చుగల్‌ రాజుగా లూయిస్‌ పిలిపె కూడా అత్యంత తక్కువ సమయం(20 నిమిషాలే!) సింహాసనం అధిష్టించిన రికార్డు ఉంది.  1908 ఫిబ్రవరి 1న జరిగిన తండ్రి కార్లోస్‌ 1 హత్య జరగ్గా.. అదే దాడిలో తీవ్రంగా గాయపడిన కొడుకు పిలిపె.. 20 నిమిషాలపాటు ప్రాణాలతో పోరాడాడు. ఆ 20 నిమిషాలను అతని సింహాసన కాలంగా గుర్తించింది పోర్చుగల్‌. 

 నైన్‌ డేస్‌ క్వీన్‌గా గుర్తింపు పొందిన లేడీ జాన్‌ గ్రే.. తొమ్మిది రోజుల పాటు ఇంగ్లండ్‌, వేల్స్‌, ఐర్లాండ్‌లకు రాణిగా సింహాసనంపై కొనసాగింది. అదీ కేవలం 16 ఏళ్ల వయసులో. 1553 జులై 10 నుంచి 19 మధ్య ఆమె రాణిగా కొనసాగింది. ఆ మరుసటి సంవత్సరమే ఆమెకు మరణ శిక్ష అమలు చేశారు. 

► రష్యాలో.. మైకేల్‌ 2 అతితక్కువ సమయం సింహాసనంపై రాజుగా కొనసాగాడు. సోదరుడు సార్‌ నికోలస్‌ 2.. మార్చి 1997లో సింహాసనం నుంచి దిగిపోగా.. 18 గంటలపాటు రాజుగా మైకేల్‌ 2 కొనసాగాడు. అయితే.. తిరుగుబాటు నేపథ్యంలో అతన్ని చెరసాలలో బంధించగా.. ఆపై హత్యకు గురయ్యాడు.

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top