మహిళలు... మరాఠాలు | Campaigning end as Maharashtra Assembly election on Nov 18 | Sakshi
Sakshi News home page

మహిళలు... మరాఠాలు

Nov 18 2024 4:31 AM | Updated on Nov 18 2024 4:31 AM

Campaigning end as Maharashtra Assembly election on Nov 18

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానాంశాలు

పార్టీల ప్రచారమంతా వాటి చుట్టే

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. నేటి సాయంత్రంతో ప్రచారానికి తెర పడనుంది. దాంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు అధికార మహాయుతి, విపక్ష ఎంవీఏ కూటములు రెండూ చివరి విడత ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. గతంతో పోలిస్తే మహారాష్ట్ర రాజకీయ రంగస్థలం ఈసారి నానారకాలుగా చీలిపోయి కని్పస్తుండటం విశేషం. ప్రధాన ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో రెండుగా చీలిపోవడం తెలిసిందే.

దాంతో ఈ ఎన్నికల్లో సత్తా చాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే సేన, ఉద్ధవ్‌ వర్గం; అజిత్‌ ఎన్సీపీ, శరద్‌ పవార్‌ వర్గం తహతహలాడుతున్నాయి. షిండే సేన, అజిత్‌ ఎన్సీపీ, బీజేపీ అధికార మహాయుతిగా; ఉద్ధవ్‌ సేన, శరద్‌ పవార్‌ ఎన్సీపీ, కాంగ్రెస్‌ విపక్ష మహా వికాస్‌ అఘాడీగా మోహరించాయి. ఈ ఎన్నికల్లో రెండు కూటముల భాగ్యరేఖలనూ మహిళా ఓటర్లు, మరాఠా రిజర్వేషన్లే చాలావరకు తేల్చనున్నట్టు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దాంతో పార్టీల ప్రచారం కూడా చాలావరకు మహిళలు, మరాఠా కోటా చుట్టే కేంద్రీకృతమై సాగింది. – సాక్షి, నేషనల్‌ డెస్క్‌

ఓటింగ్‌లో మహిళల జోరు
మహారాష్ట్రలో పురుషులతో పోలిస్తే మహిళలే చాలా ఎక్కువ సంఖ్యలో ఓటేస్తూ వస్తున్నారు. పలు ఎన్నికలుగా ఇది కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పురుషుల్లో కేవలం 61 శాతం ఓటింగ్‌ నమోదైతే ఏకంగా 79 శాతం మంది మహిళలు ఓటెత్తారు. దాంతో మహిళా శక్తిపై ఈసారి పార్టీలన్నీ గట్టిగా దృష్టి సారించాయి. మహిళల ఓట్ల కోసం హోరాహోరీ ప్రయత్నాల్లో తలమునకలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా విపక్ష ఎంవీఏ కూటమి జోరు సాగడంతో ఎన్డీఏ సారథి బీజేపీ అప్రమత్తమైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పరిస్థితిని తలకిందులు చేసేందుకు కృతనిశ్చయంతో ఉంది. మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికల వేళ మహాయుతి సర్కారు పలు పథకాలు, తాయిలాలు ప్రకటించింది. 21–65 ఏళ్ల మధ్య వయసున్న అల్పాదాయ వర్గాల మహిళలకు నెలకు రూ.1,500 అందించే లడ్కీ బహిన్‌ పథకం అందులో భాగమే. ఇది ఏకంగా సగం మంది మహిళా ఓటర్లను, అంటే దాదాపు 2 కోట్ల పై చిలుకు మందిని తమను అనుకూలంగా మారుస్తుందని బీజేపీ కూటమి ఆశలు పెట్టుకుంది.

వారి ఓట్లను గుండుగుత్తగా కొల్లగొడితే అధికారాన్ని సునాయాసంగా నిలుపుకోవచ్చని లెక్కలు వేసుకుంటోంది. దాంతో ఈ పథకానికి విరుగుడుగా ఎంవీఏ కూటమి తమను గెలిపిస్తే నెలకు ఏకంగా రూ.3,000 నేరుగా ఖాతాల్లోకే వేస్తామని మహిళలకు హామీ ఇచ్చింది. దీంతోపాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలి్పస్తాని పేర్కొంది. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 అందిస్తామన్న హామీ కూడా యువతుల్లో బాగా పని చేస్తుందని కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. టేబుల్‌

మహారాష్ట్రలో మొత్తం ఓటర్లు 9.7 కోట్లు 
పురుషులు    4.93 కోట్లు 
మహిళలు    4.6 కోట్లు

రెబెల్స్‌ కాక
తిరుగుబాటు అభ్యర్థులు కూడా పార్టీల విజయావకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కన్పిస్తున్నారు. ముఖ్యంగా మహాయుతి కూటమికి ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఆ కూటమి అభ్యర్థులపై ఏకంగా 69 మంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరు చీల్చే ఓట్లు చాలాచోట్ల ఫలితాలను తారుమారు చేసి చివరికి తమ అధికారానికే ఎసరు పెడతాయేమోనన్న ఆందోళన మహాయుతి నేతలను వెంటాడుతోంది.

ముఖ్యంగా 62 స్థానాలున్న కీలకమైన విదర్భ ప్రాంతంలో చాలా చోట్ల మహాయుతి రెబెల్స్‌ బరిలో ఉన్నారు. విపక్ష ఎంవీఏ కూటమికి కూడా రెబెల్స్‌ బెడద తప్పడం లేదు. కాంగ్రెస్‌ నుంచి ఏకంగా 29 మంది తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. మాట వినకపోవడంతో వారందరినీ పార్టీ సస్పెండ్‌ చేసింది. వీరికి జంప్‌ జిలానీలు తోడయ్యారు. మహారాష్ట్రలో గత ఐదేళ్లలో నేతల గోడదూకుళ్లు రికార్డు సృష్టించాయి. ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో కూడా చెప్పలేని పరిస్థితి! వీళ్లు కూడా ఆయా పార్టీల అవకాశాలను గట్టిగానే దెబ్బ తీసేలా కని్పస్తున్నారు.


మరాఠా రిజర్వేషన్లు
ఇక మరాఠా రిజర్వేషన్ల రగడ ఈనాటిది కాదు. విద్యా, ఉపాధి అవకాశాల్లో తాము వెనకబడి ఉన్నామని, నిర్లక్ష్యానికి గురవుతున్నామని వారిలో ఎప్పటినుంచో అసంతృప్తి గూడుకట్టుకుని ఉంది. వారి హక్కుల సాధనకు మరాఠా నేత మనోజ్‌ జరంగే పాటిల్‌ చేస్తున్న ఆందోళనకు కొన్నేళ్లుగా అపూర్వ ఆదరణ దక్కుతోంది. రాష్ట్ర జనాభాలో మరాఠాలు ఏకంగా 31 శాతానికి పైగా ఉన్నారు. దాంతో పార్టీలన్నీ అప్రమత్తమయ్యాయి. కీలకమైన మరాఠా ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.

ఓబీసీ కోటా నుంచి మరాఠాలను మినహాయించడంపై తమను జరంగే తీవ్రంగా దుయ్యబడుతుండటం బీజేపీకి మింగుడుపడటం లేదు. మరాఠాలకు అన్యాయం జరగనిచ్చే ప్రసక్తే లేదని మహాయుతి కూటమి నేతలు, అభ్యర్థులు పదేపదే చెబుతున్నా ఆ సామాజిక వర్గం నుంచి వారికి పెద్దగా సానుకూల స్పందన కని్పంచడం లేదు. దాంతో ఓబీసీలు, గిరిజన సామాజిక వర్గాల ఓట్లపై మహాయుతి కూటమి గట్టిగా దృష్టి సారించింది. వారికోసం కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు పలు వాగ్దానాలు చేసింది.  

రైతులు, నిరుద్యోగం
వీటికి తోడు రైతుల అసంతృప్తి మరో ప్రధాన ఎన్నికల అంశంగా కని్పస్తోంది. ఇటీవలి అకాల వర్షాలు రాష్ట్రంలో సాగుపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రభుత్వం ఆదుకుంటుందని భావించిన రైతులకు నిరాశే ఎదురైంది. దాంతో షిండే సర్కారుపై వారంతా గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు ఎగుమతులపై నిషేధం ఉల్లి రైతులను బాగా దెబ్బ తీసింది. ఇవన్నీ తన పుట్టి ముంచేలా కని్పస్తుండటంతో దాంతో రైతులను ఆకట్టుకునేందుకు మహాయుతి సర్కారు ఆపసోపాలు పడుతోంది. 

పంట రుణాల మాఫీ వంటి పలు హామీలు గుప్పించింది. ఇక మహారాష్ట్రలో ప్రబలంగా ఉన్న మరో సమస్య నిరుద్యోగం. దీనికి తోడు మహారాష్ట్రకు కేటాయించిన పలు భారీ ప్రాజెక్టులు వరుసగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలుతున్న వైనం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement