హరిప్రసాద్‌.. అబ్బా అనిపిస్తున్నావబ్బా | Sakshi
Sakshi News home page

హరిప్రసాద్‌.. అబ్బా అనిపిస్తున్నావబ్బా

Published Mon, Dec 12 2022 12:24 PM

Abba TV Hariprasad Popular With Comedy Videos - Sakshi

సాక్షి,అనంతపురం: డాక్టర్‌ హరిప్రసాద్‌ సొంతూరు నార్పల.  వైద్య విద్యలో ఎంఎస్‌ (జనరల్‌ సర్జరీ), ఎంసీహెచ్‌ (పీడియాట్రిక్‌ సర్జరీ)   చేశారు. కొంతకాలం పాటు అనంతపురం సర్వజనాస్పత్రిలో పనిచేశారు. ప్రస్తుతం నగరంలోని సాయినగర్‌లో సొంతంగా ఆస్పత్రి నిర్వహి స్తున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌   (హృదయపూర్వక ధ్యానం) ట్రైనర్‌గానూ సేవలందిస్తున్నారు. సర్జన్‌గా, మెడిటేషన్‌ ట్రైనర్‌గా బిజీగా ఉంటున్నప్పటికీ తన ప్రవృత్తి అయిన యాక్టింగ్‌ను విస్మరించలేదు. ఎప్పుడూ నవ్వుతూ..   నవ్విస్తూ ఉండాలని, అదే నిజమైన జీవితమని ఆయన బలంగా విశ్వసిస్తారు.  మన ధోరణికి  హృదయంలో ఉండే ఆనందం (హార్ట్‌ఫుల్‌నెస్‌ హ్యాíపీనెస్‌) ఆధారం కావాలని, అప్పుడే భౌతిక ప్రపంచం ఎన్ని ఎమోషన్స్‌ ఇచ్చినా తిరిగి ఆనందానికి చేరువవుతామని చెప్పే డాక్టర్‌ హరిప్రసాద్‌.. తన వద్దకు చికిత్సకు వచ్చే వారితోనూ సరదాగా మాట్లాడుతూ, చక్కని హాస్యాన్ని పంచుతుంటారు. తద్వారా వారిలోని ఒత్తిడిని పటాపంచలు చేసి, త్వరగా కోలుకునేందుకు తోడ్పడతారు. 

డాక్టర్‌ హరిప్రసాద్‌ ‘అబ్బా టీవీ’ ద్వారా సామాజిక మాధ్యమాల్లో బాగా పాపులర్‌ అయ్యారు. కామెడీ వీడియోలు చేస్తూ లక్షలాది మందికి చేరువయ్యారు. ఆయన కామెడీలో చక్కని టైమింగ్‌ ఉంటుంది. అంతర్లీనంగా సామాజిక సందేశమూ ఉంటుంది.     డాక్టర్‌గా తనకు ఎదురయ్యే అనుభవాలు, నిత్య జీవితంలో జరిగే సంఘటనలు, పల్లె, పట్నం వాసుల జీవనవిధానం, సామాజిక సమస్యలు..ఇలా అనేక అంశాలను ఇతివృత్తంగా తీసుకుని హాస్యభరితంగా వీడియోలు రూపొందిస్తున్నారు. కరోనా సమయంలో వ్యాధిపై అవగాహన కల్పిస్తూ, ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూ, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తూ రూపొందించిన వీడియోలు బాగా వైరల్‌ అయ్యాయి.  యూట్యూబ్, ఫేస్‌బుక్,     ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో హరిప్రసాద్‌ ఏ వీడియో పెట్టినా వేలు, లక్షల్లో వ్యూస్‌ వస్తున్నాయి. ఫేస్‌బుక్‌ పేజీకి లక్షా 20 వేల మంది ఫాలోయర్స్, యూట్యూబ్‌ చానల్‌కు లక్షా 89 వేల సబ్‌స్క్రైబర్లు ఉన్నారంటే ఆయన ఎంత ఫేమస్‌ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. 

డాక్టర్‌ హరిప్రసాద్‌ రూపొందించే కామెడీ వీడియోల్లో తనతో పాటు తన వద్ద పనిచేసే సిబ్బంది, జిల్లాకు చెందిన పలువురు కళాకారులు నటిస్తున్నారు. సర్జన్‌గా వచ్చే  సంపాదన కూడా కొంత     వరకు వదులుకుని కామెడీ వీడియోల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నారు. మంచి పొజిషన్‌లోæ ఉండి ఇలా ఎందుకు చేస్తున్నావని మొదట్లో బంధువులు, సన్నిహితులు వారించినా.. తన ప్రవృత్తిని మాత్రం వదల్లేదు.  ఇంటిల్లిపాదీ ఆనందంగా చూడదగిన వీడియోల ద్వారా అనతికాలంలోనే జనానికి చేరువయ్యారు.  లక్షలాదిమంది అభిమానులను కూడగట్టుకున్నారు. అలాగే తన వీడియోల ద్వారా పలువురు కళాకారులకు, ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తూ ప్రోత్సాహం అందిస్తున్నారు.  తన ఆధ్వర్యంలోనే అనంతపురం యాక్టర్ల సంఘం (అయాసం) ఏర్పాటు చేసి..వారిని ఒక గొడుగు కిందకు తెచ్చారు.  

డాక్టర్‌ హరిప్రసాద్‌కు సామాన్యులే కాకుండా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతరత్రా ప్రముఖులు కూడా ఫ్యాన్స్‌ అయ్యారు. ఒకసారి సినీనటుడు మోహన్‌బాబు స్వయంగా∙ఆయన నటనను మెచ్చి ఫోన్‌ చేసి అభినందించారు. సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల్లోనూ అవకాశాలు వస్తున్నాయి. ఐక్యూ, 2డీ సినిమాలు, ‘ఎవరికి వారే యమునా తీరే’ వెబ్‌ సిరీస్‌లో కీలక పాత్రలు పోషించారు. అవి రిలీజ్‌ కావాల్సి ఉంది.  
-జిల్లా డెస్క్‌

ఆనందంతోనే అసలైన జీవితం 
పీజీ చదివేటప్పుడు తీవ్ర మానసిక సంఘర్షణకు లోనయ్యా. ఆ స్థితి నుంచి బయట పడేందుకు ధ్యానం దోహదపడింది. దీంతో నా దృక్పథం మారిపోయింది. ఆనందంగా ఉండడమే నిజమైన జీవితమని గ్రహించాను. మొదట్లో వాట్సాప్‌ ద్వారా జోకులు, మెడిటేషన్‌కు సంబంధించిన అంశాలను పరిచయస్తులకు పంపేవాణ్ని. తర్వాత చిన్నచిన్న వీడియోలు రూపొందించి పంపించాను. అవి అందరికీ నచ్చి  బాగా వైరల్‌ అయ్యాయి.  యూట్యూబ్‌లో ‘అబ్బా టీవీ’ ప్రారంభించి..రెగ్యులర్‌గా వీడియోలు చేస్తున్నా. డాక్టర్‌గా, యాక్టర్‌గా సక్సెస్‌ కావడం డబుల్‌ సంతోషాన్నిస్తోంది.
– డాక్టర్‌ హరిప్రసాద్‌

Advertisement
 
Advertisement
 
Advertisement