పహాడీషరీఫ్: ఆడుకునేందుకు వెళ్లిన బాలుడు అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మయ్య శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన గడుగు వీరమణి, మహదేవ్ దంపతులకు నలుగురు పిల్లలు సంతానం. ఈ నెల 3వ తేదీన ఉదయం వీరమణి పిల్లలను ఇంట్లో వదిలి స్థానికంగానే ఉన్న సింఘానియా కంపెనీలో పనికి వెళ్లింది. రాత్రి 8 గంటలకు వచ్చి చూడగా ఆమె చిన్న కుమారుడు దీపక్(13) కనిపించలేదు. బయటి ఆడుకునేందుకు వెళ్లాడని పిల్లల ద్వారా తెలుసుకున్న ఆమె స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ విషయమై పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిస్తే పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లోనైనా సమాచారం ఇవ్వాలని తెలిపారు.
చైతన్యపురి: వేగంగా వెళుతున్న ఆటో డివైడర్‌ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు. చైతన్యపురి ఎస్‌ఐ ప్రభాకర్ తెలిపిన మేరకు.. బహదూర్‌పుర మురళినగర్‌కు చెందిన జయరాజ్‌యాదవ్(64) కుమారుడు కేశవ్‌యాదవ్ కలిసి పోచయ్య ఆటోలో చింతల్‌కుంటకు శుక్రవారం బయలుదేరారు. చైతన్యపురి చౌరస్తా వద్ద ఆటో డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ జయరాజ్‌యాదవ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మన్సూరాబాద్: తాను మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపాడో ఓ రైతు. జీవన్‌దాన్ ప్రతినిధులు తెలిపిన మేరకు.. నల్లగొండ జిల్లా గానుగబండ గ్రామానికి చెందిన షేక్ పల్సోనా (45) గత నెల 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబసభ్యులు ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్‌కు తరలించారు. ఈ నెల 4న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న జీవన్‌దాన్ ప్రతినిధులు మృతుడి భార్య షేక్ సైదాబీతో పాటు కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగహన కల్పించారు. దీంతో రెండు కిడ్నిలు, గుండె, రెండు కార్నియాలను జీవన్‌ధాన్ ప్రతినిధులు సేకరించారు.
గ్రీన్ ఛానల్ ఏర్పాటు.. నిమ్స్‌కు గుండె తరలింపు
ఎల్‌బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ వరకు 16 కిలోమిటర్ల దూరాన్ని గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 20 నిమిషాల్లో గుండెను పంజగుట్టలోని నిమ్స్ హాస్పిటల్‌కు చేర్చారు.
హయత్‌నగర్: కొహెడ శ్రీచైతన్య రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కోమటిరెడ్డి దేవేందర్‌రెడ్డి(17) గురువారం రాత్రి హాస్టల్ గదిలో బెడ్‌షీట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. హన్మకొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఇంటర్ మొదటి సంవత్సరంలో 466 మార్కులు సాధించాడు. అయితే, తనకు ఈ కళాశాలలో చదవడం ఇష్టం లేదని గతంలోనే కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. అయితే తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంపై కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కళాశాల యాజమాన్య వేధింపులే కారణమంటూ ఆందోళనకు దిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


