● వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య
● మాడ్గులలో ఉపాధి కూలీల కమిటీ ధర్నా
మాడ్గుల: గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు వరంగా మారిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీరుగారుస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు. మాడ్గుల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట శుక్రవారం ఉపాధి కూలీల కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి హామీ పథకాన్ని తొలగించేందుకు అనేక మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. హామీ పథకానికి బడ్జెట్‌ను పూర్తిగా తగ్గించిందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ పథకాన్ని మతపరమైన విధంగా వీబీజీ–రామ్‌జీ పేరుతో అమలు చేస్తుందని చెప్పారు. పనులకు వచ్చిన కూలీలను రెండుసార్లు ఫొటో తీయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల కూలీలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం రూ.800 అందించాలని, సంవత్సరంలో 200 రోజుల పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీఓ విజయలక్ష్మికి అందించారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మికసంఘం మండల శాఖ అధ్యక్షుడు పాషా, నాయకులు సైదమ్మ, శ్రీను, అంజయ్య, నర్సింహ, మైసయ్య, సైదయ్య, కృష్ణయ్య, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.


