అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

కొడంగల్‌: అభివృద్ధి పనుల్లో వేగం పెంచి సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చొరవ చూపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస రాజు, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీసీ గురుకుల పాఠశాల, డిగ్రీ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి సాధించాలన్నారు. సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పారదర్శకంగా, నాణ్యతగా పనులు చేయించాలన్నారు. అనంతరం పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. రూ.110 కోట్ల వ్య యంతో చేపట్టిన ఆలయ పునర్నవీకరణ పనులను పరిశీలించారు. ముందుగా బాలాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ధర్మకర్తలు స్వాగతం పలికారు. పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వైఖానస ఆగమ శాస్త్రోక్తంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. సంప్రదాయ నిర్మాణ శైలిని కాపాడుతూ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో పాటు వాస్తు నిపుణులతో కలిసి సమన్వయంతో పని చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. తిరుమల తరహాలో ప్రధాన ఆలయం, అమ్మవార్ల ఆలయాలు, ఉప ఆలయాలు, మాఢ వీధులు, క్యూలైన్‌, కల్యాణ మంటపం, కల్యాణ కట్ట, పూజా మందిరాలు, వసతి గదులు, స్నాన ఘట్టాలు, మరుగుదొడ్లు, పార్కింగ్‌, పుష్కరిణి, ప్రసాదం కౌంటర్లు తదితర వాటికి నూతన భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. పనుల్లో జాప్యం జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రశాంత్‌ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాస రాజు

కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ తిరుపతిరెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement