చోరీ చేసి.. నంబర్‌ మార్చి | - | Sakshi
Sakshi News home page

చోరీ చేసి.. నంబర్‌ మార్చి

Jun 6 2026 9:13 AM | Updated on Jun 6 2026 9:13 AM

ద్విచక్ర వాహనాల దొంగల అరెస్ట్‌

ఎనిమిది బైక్‌లు స్వాధీనం

కడ్తాల్‌: ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరి కేటుగాళ్లను కడ్తాల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సైదిరెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. గురువారం రాత్రి మండల కేంద్రం సమీపంలోని తలకొండపల్లి కూడలిలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా, స్కూటీపై అనుమానాస్పదంగా వెళుతున్న ఇద్దరు యువకులను ఆపారు. సరైన ఆధారాలు చూయించలేకపోవడంతో అదుపులోకి తీసుకుని విచారించగా స్కూటీని దొంగతనం చేసినట్లు అంగీకరించారు. ఇందులో భాగంగా వివిధ ఠాణాల పరిధిలో చోరీకి గురైన ఎనిమిది ద్విచక్రవాహనాల కేసులు కూడా వెలుగులోకి వచ్చాయి. నిందితులు ఆమనగల్లు మండలం చంద్రయాన్‌పల్లి తండాకు చెందిన చరణ్‌, తలకొండపల్లి మండలం బోడియాతండాకు చెందిన అనిల్‌, ఖమ్మం జిల్లాకు చెందిన కిల్లంపల్లి రాజశేఖర్‌ అలియాస్‌ శేఖర్‌ అని తేలింది. సులభంగా డబ్బులు సంపాందించాలనే ఉద్దేశంతో వీరు ముఠాగా ఏర్పడి బైకుల చోరీలకు పాల్పడుతున్నారు. వీరంతా వివిధ ప్రాంతాల్లో పార్క్‌ చేసి ఉంచిన వాహనాలను చోరీ చేసి, వాటి నంబర్‌ ప్లేట్లు మార్చి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సూత్రధారి అయిన రాజశేఖర్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి, వాహనాల రికవరీలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్‌ టీం ఎస్‌ఐ చంద్రశేఖర్‌, కానిస్టేబుల్‌ మహేశ్‌, రాంకోఠి, రఘునాయక్‌లను సీఐ సైదిరెడ్డి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement