న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 5 శ్రీ జూన్ శ్రీ 2026
తుర్కయంజాల్: కొహెడ సర్వే నంబర్ 167 బై 1లో శనివారం నిర్వహించనున్న సీఎం రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లను శుక్రవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పరిశీలించనున్నట్లు గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి తెలిపారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కలెక్టర్ నారాయణ రెడ్డి తదితరులు హాజరుకానున్నట్టు తెలిపారు.
మొయినాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే స్కూళ్లకు చేరుతున్నాయి. మండలంలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకోసం ఇప్పటికే మండల వనరుల కేంద్రానికి చేరాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకోసం మొత్తం 21,497 పాఠ్యపుస్తకాలు, 31,165 నోట్ పుస్తకాలు వచ్చినట్టు మండల విద్యాధికారి మల్లయ్య తెలిపారు. మరో ఏడు టైటిల్స్ రావాల్సి ఉందన్నారు. గురువారం మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వాటిని పంపిణీ చేశారు.
అనంతగిరి: క్రీడలతో శారీరక దృఢత్వం తోపాటు స్నేహభావం పెరుగుతుందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. గురువారం వికారాబాద్‌లోని బ్లాక్ గ్రౌండ్‌లో వీడీఎఫ్‌ఏ ఆధ్వర్యంలో స్పీకర్ కప్ పోటీలు నిర్వహించారు. విజేత జట్లకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటమలు సహజమన్నారు. ఓటమి గెలుపుకు నాంది అన్నారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ సంతోష్‌కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ చిగుళ్లపల్లి రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేట: మూసారంబాగ్ డౌన్ స్ట్రీమ్ బ్రిడ్జి, సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణాన్ని గురువారం జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తనిఖీ చేశారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించారు. మిగిలిన పనులు వేగిరం చేసి, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆదేశించారు. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జికి మొత్తం 85 స్పాన్‌లు ఉండగా వాటికి గర్డర్లు నిర్మించామని, 79 స్పాన్‌లకు డెక్‌స్లాబ్ పూర్తయిందని, అప్ ర్యాంప్, డౌన్‌ర్యాంప్ పనులు ఏక కాలంలో జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: సాధారణంగా ఇబ్రహీంపట్నం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో రోజుకు సగటున 60 నుంచి 80 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటా యి. గురువారం ఏకంగా 130 ఆస్తులు రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఇక ఎల్బీనగర్ ఎస్‌ఆర్‌ఓలో రోజుకు 40 నుంచి 50 ఆస్తులు రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. తాజాగా 80కిపైగా స్లాట్లు బుక్కయ్యాయి. ఇక మూసాపేటలోని జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసు సహా హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, చంపాపేట్, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట్ సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ ఇదే పరిస్థితి. ప్రభుత్వం సవరించిన భూముల మార్కెట్ విలువ శుక్రవారం నుంచి అమ ల్లోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఔటర్ అవతల ఉన్న మండల కేంద్రాల్లో 50 శాతం, లోపల ఉన్న మున్సిపల్ కేంద్రాలు సహా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్, నార్సింగి, కొండాపూర్, మదాపూర్, సహా ఔటర్‌కు అటు ఇటుగా ఉన్న వాణిజ్య స్థలాలు, కొత్తగా అందుబా టులోకి రాబోతున్న గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల వెంట వంద శాతం పెరిగే అవకాశం ఉంది.
పొద్దుపోయే వరకు రిజిస్ట్రేషన్లు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత 2021లో భూముల మార్కెట్ విలువను 20 శాతం పెంచుతూ అప్పటి ప్రభుత్వం తొలిసారిగా నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2022లో 33 శాతం పెంచింది. తాజాగా స్థానికంగా ఉన్న మౌలిక సదుపాయాలు, వాణిజ్యపరమైన డిమాండ్‌ను బట్టి 40 నుంచి 50 శాతం పెంచింది. మరికొన్ని చోట్ల ఏకంగా వందశాతం పెరిగే అవకాశం ఉంది. నిజానికి ఓఆర్‌ఆర్ లోపల 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు ఉండగా జిల్లాలో నెలకు సగటున 21 నుంచి 22 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి నెలకు రూ.360 కోట్ల ఆదాయం సమకూరుతుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, స్టాంప్‌డ్యూటీ చార్జీలు రెట్టింపు కానుండడంతో ఇప్పటికే భూ విక్రయదారులు, బిల్డర్లతో ఆస్తుల అగ్రిమెంట్ చేసుకున్న కొనుగోలుదారులు ఆఖరి రోజైన గురువారం రిజిస్ట్రేషన్లకు క్యూ కట్టారు. దీంతో ఆయా ఆఫీసులు ఉద్యోగులు, డాక్యుమెంట్ రైటర్లు, క్రయవిక్రయదారులతో కిక్కిరిసిపోయాయి. పరిమితికి మించి స్లాట్లు బుక్ కావడంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది రాత్రి పొద్దు పోయే వరకు ఆఫీసుల్లోనే ఉండి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు.
ఎక్కడ ఎంతంటే..
● తుక్కుగూడ, మంకాల్‌లో 70 శాతం పెంచినట్లు తెలిసింది. ఇక్కడ ఎకరం విలువ రూ.78,40,000 ఉండగా, తాజాగా రూ.1,33,28,000 పెంచినట్లు సమాచారం. వాణిజ్యస్థలం గజం ధర రూ.10,500 నుంచి 18,400 పెరిగే అవకాశం ఉంది.
● కోకాపేటలో ప్రస్తుతం ఎకరం ధర రూ.7 కోట్లు ఉండగా, దాన్ని రూ.10 కోట్లకు పెంచినట్లు తెలిసింది.
● కందుకూరులో ఎకరం ధర రూ.50 లక్షలు ఉండగా, ప్రస్తుతం రూ.3 కోట్లకు పెంచినట్లు సమాచారం.
● యాచారంలో ఎకరం ధర రూ.50 లక్షలలోపు ఉండేలా నిర్ణయం తీసుకుంది.
● ఇబ్రహీంపట్నం గ్రామీణ ప్రాంతంలో ఎకరం ధర రూ.15 లక్షలు ఉండగా, దాన్ని రూ.60 లక్షలకు పెంచినట్లు తెలిసింది.
● మొయినాబాద్ మున్సిపాలిటీ హిమాయత్‌సాగర్‌లో ఎకరం రూ.82.50 లక్షలు ఉండగా, దీన్ని డబుల్ చేసినట్లు సమాచారం.
● ఓఆర్‌ఆర్‌కు అవతల ఎకరం రూ.10 లక్షలుగా నిర్ణయించారు.
● ఓఆర్‌ఆర్‌కు లోపల అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు కనిష్టంగా రూ.3,600 చేశారు.
● శంకర్‌పల్లిలో రూ.2,500 నుంచి రూ.5,500 వరకు పెంచినట్లు తెలిసింది.
● చేవెళ్ల ప్రాంతంలో భూముల విలువ ప్రస్తుతం రూ.7.5లక్షలు, రూ.16.50 లక్షలు, రూ.42 లక్షలుగా ఉంది. ఇది ఆయా ప్రాంతాల వారీగా దాదాపు రెట్టింపు కానుంది. ప్లాట్ల విలువ రూ.2,100 ఉన్నది రూ.4వేల నుంచి రూ.5వేల మధ్యలో పెరగనుంది. పట్టణ కేంద్రాల్లో రూ.7,100 ఉన్నది రూ.10 వేల నుంచి రూ.11వేల మధ్య పెరగనుంది.
నూతన ఆర్డీవోగా శ్రీనివాస్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను జిల్లా రెవెన్యూ అధికారిగా నియమిస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కలెక్టరేట్‌లోని ఎస్‌డీసీ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. మూడేళ్లపాటు అనంతరెడ్డి ఆర్డీవోగా విధులు నిర్వర్తించారు.
భూముల మార్కెట్ విలువ సవరణ ప్రభావం
రిజిస్ట్రేషన్ ఆఫీసులకు క్యూకట్టిన క్రయవిక్రయదారులు
అంచనాలకు మించి రిజిస్ట్రేషన్లు
కిక్కిరిసిపోయిన ఎస్‌ఆర్‌ఓ కేంద్రాలు
పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి..


