కబ్జా కోరల్లో సురంగల్
ఎర్రకుంట వాగు
మొయినాబాద్: ప్రభుత్వ భూములు, కాల్వలు, చెరువులు ఎక్కడుంటే అక్రమార్కుల చూపు అక్కడ వాలిపోతోంది. కొంతమంది పాలకులు, అధికారులతో కుమ్మకై ్క దర్జాగా కబ్జాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ శివారు నుంచి ఎర్రకుంట వాగు ఉంది. కనకమామిడి, సురంగల్, అమ్డాపూర్, నజీబ్‌నగర్ రెవెన్యూల్లోని వర్షం నీరంతా ఎర్రకుంట వాగు ద్వారా ప్రవహించి ఈసీ వాగులో కలుస్తుంది. సురంగల్ రెవెన్యూలోని సర్వేనంబర్ 332, 282లో ఉన్న పలువురు ప్రైవేటు వ్యక్తుల భూమి ఎర్రకుంట వాగు సమీపం వరకు ఉంటుంది. వీటిని కొనుగోలు చేసిన కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాగును సైతం ఆక్రమిస్తున్నారు. వాగు మధ్య నుంచి పునాది తీసి గోడ నిర్మిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి, మరో నాయకుడి అండదండలతోనే వీరు వాగును కబ్జా చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
తోలుకట్టలో..
మండల పరిధిలోని తోలుకట్ట రెవెన్యూలో గుండ్లవాగు కాల్వ ఉంది. దీనికి ఆనుకుని సర్వేనంబర్ 191లో ప్రైవేటు భూమి ఉంది. నగరానికి చెందిన ఓ వ్యాపారి దీన్ని కొనుగోలు చేసి వాగు కాల్వను పూర్తిగా ఆక్రమించాడు. ఎవరి అనుమతి లేకుండానే కాలువలో నుంచి పైపులు వేసి పైనుంచి మట్టితో పూడ్చివేసి ప్రహరీ నిర్మించాడు. ఈతతంగం జరిగి ఆరు నెలలు గడుస్తున్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం మొదలైతే కాల్వలోకి వెళ్లాల్సిన వరదనీరు పంట పొలాల్లోకి చేరుతుందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు స్పందించి కాల్వలను కబ్జా చెర నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు.
తోలుకట్టలో గుండ్లవాగును
పూడ్చి ప్రహరీ నిర్మాణం
పట్టించుకోని ఇరిగేషన్,
రెవెన్యూ అధికారులు
చర్యలు తీసుకుంటాం
సురంగల్ ఎర్రకుంట వాగులో ప్రహరీ గోడ నిర్మిస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తోలుకట్ట గుండ్లవాగు కాల్వను పూడ్చినట్లు తెలిసింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను పంపించి పరిశీలించాం. కాల్వలో వేసిన పైపులను తొలగించి పూడ్చినవారిపై చర్యలు తీసుకుంటాం.
– గౌతమ్‌కుమార్, తహసీల్దార్, మొయినాబాద్


