● 61 కేసుల్లో నిందితుడు
● వికారాబాద్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
● తుపాకీ, బంగారం స్వాధీనం
అనంతగిరి: కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగ, 61 కేసుల్లో నిందితుడైన వికాస్‌సింగ్‌ను వికారాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పీఎస్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ స్నేహమెహ్ర వివరాలు వెల్లడించారు. వికారా బాద్ మున్సిపల్ పరిధిలోని మణికంఠనగర్ కాలనీలో మే1 న రాత్రి సమయంలో తాళం వేసిన ఇంట్లో దూరిన ఓ దొంగ తులంన్నర బంగారు ఆభరణాలు, రూ.2.10లక్షలు దోచుకెళ్లాడు. కేసు నమో దు చేసిన పోలీసులు డీఎస్పీ అంజయ్య ఆధ్వర్యంలో సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ బల్వంత్‌రాయ్, వికారాబాద్ సీఐ రఘుకుమార్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. సీసీ కెమెరాలు, ఘటనాస్థలంలో సేకరించిన ఆధారాలను పరిశీలించి నిందితుడు వికాస్సింగ్ అలియాస్ తేజాసింగ్‌గా గుర్తించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారంలో నివాసం ఉంటున్న వికాస్‌సింగ్ పైకి కూలీ పనులు చేస్తున్నట్లు నటిస్తూ తాళాలు వేసి ఉన్న ఇళ్లలో రాత్రి వేళ దొంగ తనాలకు పాల్పడేవాడు. ఇతనిపై నిఘా పెట్టిన పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకుని విచారించగా నేరాల చిట్టా విప్పాడు.
బాల్యంలోనే చోరీల బాట
పదహారేళ్ల వయసులో నేర జీవితాన్ని ప్రారంభించిన ఇతనిపై సంగారెడ్డి, బొల్లారం పరిసరాల పరిధిలో 34 కేసులున్నాయి. జైలు శిక్ష అనుభవించిన వికాస్‌సింగ్ 2024 జూన్ 26న విడుదలయ్యాడు. ప్రవర్తణలో మార్పు రాకపోవడంతో వికారాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి పరిధిలో 27 సార్లు చోరీ లకు పాల్పడి 157 తులాల బంగారం, 256 తులాల వెండి, రూ.8,22,500 నగదును దోచుకెళ్లాడు. ఈ సొమ్ముతో జల్సాలు చేయడమే కాకుండా హెల్పింగ్ హ్యాండ్ అనే ఎన్జీఓ పేరుతో తన స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితులను చైన్నె, గోవా, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూర్, రాజస్థాన్, డెహ్రాడూన్‌ల విహార యాత్రలకు పంపిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా సామాజిక రక్షణ వలయం ఏర్పరచుకున్నాడు.
వారి ప్రోద్బలంతోనే..
చోరీ చేసిన ఆభరణాలను తన స్వగ్రామ పరిసరా ల్లోని కుర్వర్, గంజేరికి చెందిన శ్యామ్ మోహన్, సూరజ్ మోహన్, అశోక్ సోని, వికాస్ అగ్రహారి అనే బంగారం వ్యాపారులకు అమ్మేవాడు. ఇతనితో మంచి సంపాదన ఉందని భావించిన సదరు వ్యాపారులు బాల్యంలోనే వికాస్‌సింగ్‌కు డబ్బులిచ్చి దొంగతనాలకు ప్రోత్సహించారు. స్థానికంగా చోరీలు చేస్తే పోలీసులతో ఇబ్బంది తలెత్తుతోందని చెప్పి ఇతర రాష్ట్రాలకు వెళ్లమని ఉసిగొల్పారు. తలా రూ.10 వేలు ఇచ్చి ఓ తుపాకీ (2ఎంఎం పిస్టల్) కొనుగోలు చేయమని సూచించారు. ఇప్పటి వరకు ఇతనిపై 61 కేసులు నమోదయ్యాయి. నిందితుడి నుంచి తులంనర బంగారం, తుపాకీ స్వాధీ నం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఇతన్ని పట్టుకున్న పోలీసు బృందాన్ని అభినందించారు.


