ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ఇబ్రహీంపట్నం: ఫార్మర్ రిజిస్ట్రీని రైతులు తప్పక చేసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం కర్ణంగూడలో నిర్వహించిన గ్రామసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్‌కు యాప్ అనుసంధానం చేసినందున రైతులు తప్పనిసరిగా భూమి విస్తీర్ణం, సాగు చేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదు చేసుకోవాలని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను పునఃప్రారంభించేందుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా ప్రారంభమయ్యే పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ శాఖ సూచనల మేరకు రైతులు పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వర్షాకాలంలో నీటి కాలుష్యం, దోమల వ్యాప్తి, అంటువ్యాధుల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా కార్యక్రమంలో ప్రతి అర్హుడి పేరు నమోదయ్యేలా సహకరించాలన్నారు. మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రమాదాలు అరికట్టేందుకు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఏసీపీ కేపీవీ రాజు, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్, సర్పంచ్ తిరుమలరెడ్డి, జిల్లా ఉద్యానవనశాఖాధికారి సురేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ నారాయణరెడ్డి


