● సేంద్రియ విధానంలో
పంటల సాగు ఆరోగ్యకరం
● కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ
కందుకూరు: సేంద్రియ పంటల కొనుగోలుకు వినియోగదారులు అధికంగా ఆసక్తి చూపుతుంటారు. ఖర్చు ఎక్కువైనా అందుబాటులో ఉంటే కొనేందుకు ఆసక్తి చూపుతారు. ఆర్గానిక్ విధానంలో పాలకూర, తోటకూర, గోంగూర, మెంతికూర, కొత్తిమీర సాగు చేసి మంచి లాభాలు ఆర్జించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం క్రిడా నిపుణుడు జి.శ్రీకృష్ణ సూచిస్తున్నారు. ఇందులో సస్యరక్షణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన రైతులకు పలు సలహాలు, సూచనలు అందించారు.
నేలలు..
చౌడు నేలలు మినహా అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. ఇసుకతో కూడిన ఎర్ర నేలలు అధిక దిగుబడినిస్తాయి. అధిక దిగుబడులకు ఉదజని సూచిక 7.0 ఉన్న నేలలు అనుకూలం. బీజామృతంతో విత్తనశుద్ధి చేయాలి.
విత్తన మోతాదు
● పాలకూర ఎకరాకు 10– 12 కిలోలు
● గోంగూర 6 కిలోలు
● మెంతికూర 8– 10 కిలోలు
సాగు విధానం..
● చిన్నచిన్న మడులు కట్టి విత్తనాలను నేరుగా వెదజల్లి విత్తుకోవాలి.
● ఏడాది పొడవునా ఎప్పుడైనా వీటిని సాగు చేయొచ్చు.
● నవంబర్– డిసెంబర్ నెలల్లో విత్తుకుంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చు.
నీటి యాజమాన్యం...
● విత్తిన వెంటనే ఒక తడి ఇవ్వాలి.
● విత్తిన 3 రోజులకు రెండో తడి అందించాలి.
● ఆతర్వాత భూమిలో తేమశాతాన్ని బట్టి వారం నుంచి పదిరోజులకు ఒక తడి పెట్టాలి.
ఎరువుల యాజమాన్యం
● ఎకరాకు 2,500 కిలోల నాడెప్ కంపోస్టు వేయాలి.
● 125 కిలోల ఘన జీవామృతం వేస్తూ విత్తనాన్ని నాటాలి.
సస్యరక్షణ..
● రసం పీల్చే పురుగులు ఆకుల నుంచి మరియు లేత కాండం నుంచి రసం పీల్చడం వలన ఆకులు ముడుచుకునిపోయి పసుపు రంగుకు మారతాయి. ఆకులు నాణ్యత కోల్పోతాయి.
● ఒక్కోసారి ఆకులపై నల్లటి మసి ఏర్పడుతుంది.
● నివారణకు తప్పనిసరి పరిస్థితుల్లో వేప సంబంధిత మందులు (వేప కషాయం, నీమాస్త్రం, వేప నూనె మొదలైనవి) మాత్రమే పంటకాలంలో 1– 2 సార్లు పది రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఆతర్వాత 3, 4 రోజలలో ఆకులను కోసుకోవచ్చు.
● గొంగళి పురుగులను చేతితో ఏరివేసి నాశనం చేయడం చాలా మంచిది.
తెగుళ్లు
● తెగులు సమస్య ఎక్కువగా ఉన్న భూముల్లో పంట మార్పిడి పద్ధతిని పాటించాలి.
● బీజామృతంతో తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి.
● 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి, మాగిన పశువుల ఎరువు 90 కిలోలు, 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మగ్గిన తర్వాత ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి.
● ఇలా చేయడంతో నేల ద్వారా ఆశించే తెగుళ్లను అరికట్టవచ్చును.
● పుల్లటి మజ్జిగ మరియు ఇంగువ ద్రావణం 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పంటపై పిచికారీ చేసి ఆకుమచ్చ తెగులు, బూడిద తెగులు నివారించవచ్చు.
● పదిహేరు రోజులకు ఒకసారి పంటపై జీవామృతం పిచికారీ చేసి, నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు.


