నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌లో అగ్నిప్రమాదం

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

మొయినాబాద్‌: షార్ట్‌ సర్క్యూట్‌తో నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌లో మంటలు అంటుకుని ఫర్నిచర్‌ కాలిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి మంటలు ఆర్పడంతో ప్రమాదం తప్పింది. మున్సిపల్‌ కేంద్రంలోని కరున నర్సింగ్‌ స్కూల్‌ హాస్టల్‌ భవనంలో గురువారం ప్యానల్‌ బోర్డులో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. ఆ సమయంలో హాస్టల్‌ భవనంలో ఇద్దరే విద్యార్థులు ఉన్నారు. మంటలు ఎగిసి పడుతుండడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే స్థానికులు పైపులతో నీళ్లు పట్టి మంటలు ఆర్పారు. అప్పటికే ప్యానల్‌ బోర్డు గదిలో ఉన్న ఫర్నిచర్‌తోపాటు ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఎవరికీ ఎలాంటి అపాయం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

యాలాల: ఈతకు వెళ్లి గల్లంతు అయిన వ్యక్తి మృతదేహం లభ్యం అయింది. వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం బస్తాపూర్‌కు చెందిన రహమత్‌(28)తో పాటు పాత తాండూరు వాసి మోయిజొద్దీన్‌లు బుధవారం సాయంత్రం కోకట్‌ కాగ్నా నదిలో ఈతకు వెళ్లి, మునిగిన సంగతి విధితమే. అందులో మోయిజోద్దిన్‌ మృతదేహం అదే రోజు లభ్యం కాగా.. రహమత్‌ ఆచూకీ లేకుండా పోయింది. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, తాండూరు అగ్ని మాపక సిబ్బంది బుధవారం చీకటి పడేంతవరకు నదిలో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. కాగా.. గురువారం తెల్లవారుజాము నుంచి మరలా గాలింపు చేపట్టగా.. రహమత్‌ మృతదేహం లభ్యమైంది. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

శిక్షణ, ఉపాధిని వినియోగించుకోండి

కుల్కచర్ల: నిరుద్యోగ గిరిజన యువతకు ప్రభుత్వం ఇచ్చే శిక్షణ, ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కమలాకర్‌ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో యువతకు వివిధ సంస్థల ఆధ్వర్యంలో ఇచ్చే శిక్షణ, ఉద్యోగాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్‌ నాయక్‌, గిరిజన వసతిగృహ ప్రత్యేకాధికారులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

‘సర్‌’పై ప్రత్యేక దృష్టి

తాండూరు: ఓటరు జాబితా ముమ్మర సవరణ(సర్‌) కార్యక్రమం ముగిసే వరకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ తాండూరు నియోజకవర్గ సర్‌ కమిటీ కన్వీనర్‌ కరణం పురుషోత్తంరావు అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లడారు. ఓటరు జాబితా సవరణలో అర్హులైన ఓటర్లు, పార్టీ మద్దతు దారుల ఓట్లకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా పట్టణంలోని తులసీ గార్డెన్‌లో ఈ నెల 7న ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యక్షతన 269 మంది బీఎల్‌ఏలతో సమావేశం జరగనుందని పేర్కొన్నారు. సవరణలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా.. పార్టీ నేతల దృష్టికి తేవాలని సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పట్లోళ్ల నర్సింహులు, పార్టీ నాయకులు, ఆత్మ కమిటీ చైర్మన్లు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement