అన్నదాత ఆగం! | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆగం!

Jun 5 2026 10:03 AM | Updated on Jun 5 2026 10:03 AM

తూకంలో తరుగు..

హమాలీ బాదుడు!

బషీరాబాద్‌: ఆరుగాలం శ్రమించి పండించిన పంటను మద్దతు ధరకు అమ్ముకోవడానికి వెళ్లిన రైతులు దోపిడీకి గురవుతున్నారు. ఓ వైపు తూకాల్లో, మరో వైపు తాలు, తేమ పేరిట బస్తాకు మూడు కిలోల తరుగు తీస్తుండగా మరో వైపు హమాలీ ఛార్జీల పేరుతో పెనుభారం మోపుతున్నారు. బషీరాబాద్‌ మండలంలో ఐకేపీ, సొసైటీ కింద కాశీంపూర్‌, దామర్‌చెడ్‌, నవల్గా, నావంద్గీ, మైల్వార్‌ కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి 51,154 బస్తాల ధాన్యం సేకరించారు. ఈ బస్తాకు తరుగు పేరిట అదనంగా మూడు కిలోలు తూకం వేయడంతో మరో 1,534 క్వింటాళ్ల ధాన్యాన్ని రైతులు నష్టపోయారు. బస్తాకు 40 కిలోల లెక్కన 2,046 టన్నుల వరి ధాన్యం ఐదు కేంద్రాల నుంచి ఇప్పటికే మిల్లులకు తరలించారు. ఈ ధాన్యం తూకం వేయడానికి హమాలీ ఖర్చుల కింద క్వింటాలుకు రూ.35 చొప్పున రూ.7.17లక్షలు వసూలు చేశారు.

ప్రభుత్వ నిబంధనలు ఇలా..

కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తెచ్చిన తర్వాత అన్ని పనులను హమాలీలే చూసుకుంటారు. లోడింగ్‌ మొదలు కొని తూకాలు వేమడం, బస్తాలు కుట్టి లారీల్లో తరలించడం వీరి బాధ్యత. ఇందుకు ప్రభుత్వం రూ.క్వింటాలుకు రూ.20 చెల్లిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.5 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 చెల్లించాల్సి ఉంటుంది. కానీ కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతుల లోడింగ్‌, అన్‌లోడింగ్‌, తూకాలు వేయడం వంటి పనులకు క్వింటాలుకు రూ.32 నుంచి 35 వరకు వసూలు చేస్తున్నారు. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధం.

క్వింటాలుకు రూ.35 చొప్పున వడ్డన

రైతుల నుంచి ఇప్పటికే

రూ.7.17 లక్షలు వసూలు

చార్జీలకు రశీదులు ఇవ్వని నిర్వాహకులు

పట్టించుకోని అధికార యంత్రాంగం

Advertisement
 
Advertisement
Advertisement