జర్నలిస్ట్ ఫోరం జిల్లా
సహాయ కార్యదర్శి వెంకన్న
అబ్దుల్లాపూర్‌మెట్: తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ప్రభు త్వం గుర్తించాలని తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం(టీజేఎఫ్) రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి పల్లె వెంకన్న కోరారు. గురువారం అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2009–2014 జూన్ 2 వరకు ఎల్‌బీనగర్‌లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో సమష్టి పోరాటలు చేశామన్నారు. ఓ పక్కన జేఏసీ కింద ఉద్యోగులు, న్యాయవాదులు, ఆర్టీసీ, ప్రజాసంఘలతో కలిసి పెద్ద ఎత్తున తెలంగాణ పోరు సాగించామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు జరిగిన పోరాటాల్లో జర్నలిస్టులు కీలక భూమిక పోషించారన్నారు. ప్రస్తుతం సర్కారు అర్హులైన ఉద్యమ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులు, హెల్త్ కార్డు లు జారీ చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. త్వరలో ఉద్యమ జర్నలిస్టులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మద్యం దుకాణంలో చోరీ
కొడంగల్ రూరల్: వైన్‌షాపులో దొంగతనం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని నాగ ఎల్లమ్మ వైన్ షాపును నిర్వాహకులు బుధవారం రాత్రి ఎప్పటిలాగే మూసివేశారు. అర్ధరాత్రి సమయంలో దుండగులు దుకాణం వెనుకభాగం నుంచి చొరబడి అందిన కాడికి అపహరించారు. గురువారం ఉదయం దుకాణం తెరచిన నిర్వాహకులు.. సామగ్రి చిందరవందరగా పడుండటాన్ని గమనించి చోరీ జరిగిందని, రూ.50 వేల నగదుతో పాటు, రూ.10 వేల విలువ చేసే మద్యం సీసాలను అపహరించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులు సమాచారం ఇవ్వగా.. క్లూస్ టీం వచ్చి పరిసరాలను పరిశీలించింది. వివరాలు సేకరించారు. నిర్వాహకుడు రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ యాదయ్య తెలిపారు.


