అరగంటలోనే పునరుద్ధరణ
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్యంగా 33కేవీ, 11 కేవీ లైన్లపై ప్రత్యేక దృష్టి సారించాం. భారీ ఈదురు గాలులతో కూడిన వర్షాలను సైతం తట్టుకుని నిలబడే విధంగా లైన్లను తీర్చిదిద్దుతున్నాం. లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లకొమ్మ ల తొలగింపు ప్రక్రియను ఇప్పటికే చేపట్టాం. అధిక లోడు సమస్యతో ఇబ్బంది పడుతున్న సబ్‌స్టేషన్లు, ఫీడర్లు, డీటీఆర్‌లను గుర్తించి, వాటి స్థానంలో అదనపు సామర్థ్యంతో కూడిన పీటీఆర్‌లు, డీటీఆర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. కొత్తగా మరో 75 సబ్‌స్టేషన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. రాబోయే రోజుల్లో రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’అని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి దెబ్బతిన్న ఫీడర్లు, సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యలు, వాటి పరిష్కారానికి క్షేత్ర స్థాయి సిబ్బంది చేసిన కృషిని ఆయన వివరించారు.
మెటీరియల్ కొరత లేకుండా చూస్తాం
కొత్తలైన్లు, కనెక్షన్ల జారీకి అవసరమైన మెటీరియల్‌ను డిస్కం సమకూర్చుతుంది. మెజార్టీ ఇంజనీర్లు అవసరం లేకపోయినా..ముందస్తు జాగ్రత్తల పేరుతో డిపార్ట్‌మెంట్ పనుల పేరుతో స్టోర్స్ నుంచి మెటీరియల్ డ్రా చేసి, ఆ తర్వాత దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. విద్యుత్ స్టోర్స్ నుంచి డ్రా చేసిన మెటీరియల్‌కు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్న మెటీరియల్‌కు పొంతన ఉండటం లేదు. ఇకపై విద్యుత్ స్టోర్స్‌పై పక్కా నిఘా పెట్టనున్నాం. అంచనాలు రూపొందించిన తర్వాతే సెక్షన్ల వారీగా మెటీరియల్ మంజూరు చేయాలని నిర్ణయించాం. పక్కాగా ఆడిట్ నిర్వహించబోతున్నాం. తద్వారా మెటీరియల్ కొరత లేకుండా చూడబోతున్నాం. అండర్‌గ్రౌండ్ కేబుళ్ల కొరత ను నివారించేందుకు ఇప్పటికే ఆయా వెండర్ కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించాం. త్వరలోనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపబోతున్నాంస్టోర్స్‌లో మీటర్లు లేవనే సమస్యే లేదు. బర్ట్న్, స్ట్రకప్ మీటర్ల స్థానంలో కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్నాంఎవరైనా మీటర్లు లేవని చెప్పితే.. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి.
పదిమీటర్ల ఎత్తు దాటితే ఓసీ
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లో చేపట్టే నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్ల జారీ విషయంలో ఆంక్షలు విధించాం. ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అయితే ఈఆర్‌సీ నిబంధనల మేరకు ఎలాంటి వివాదం లేని గ్రామకంఠం భూముల్లోని నిర్మాణాలు సహా నోటరీ డాక్యుమెంట్ దరఖాస్తులకు సైతం కనెక్షన్లు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. పది మీటర్ల ఎత్తు దాటిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మస్ట్ చేశాం. అంతకు లోపు ఉన్న భవనాలకు ఎలాంటి ఓసీలు అవసరం లేదు. ఎస్టిమేషన్ల విధానంలోనూ మార్పులు తీసుకొచ్చాం. వినియోగదారుడు ఎంపిక చేసుకున్న లోడు ఆధారంగా ఫిక్స్‌డ్ ఛార్జీలు నిర్ణయించాం. అంచనాల రూపకల్పనలో ఎలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. టర్న్‌కీ విధానంలోనూ పలు మార్పులు తీసుకొచ్చాం. కేటాయించిన పనులు పూర్తి చేసిన తర్వాత సదరు కాంట్రాక్టర్‌కు మరో పని అప్పగించాలని నిర్ణయించాం.
అర్ధరాత్రి కూడా అప్రమత్తంగా ఉంటున్నాం. మంగళవారం అర్ధరాత్రి తర్వాత అకస్మాత్తుగా కురిసిన వర్షానికి మేడ్చల్ జోన్‌లో 91 ఫీడర్లు, రంగారెడ్డి జోన్‌లో 47 ఫీడర్లు, మెట్రోజోన్ పరిధిలో 14 ఫీడర్ల పరిధిలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. కేవలం అరగంట వ్యవధిలోనే మెజార్టీ ఫీడర్ల పరిధిలో సరఫరాను పునరుద్ధరించాం. ఈ సమయంలో వాట్సాప్, ట్విట్టర్, యాప్, వెబ్‌సైట్, ఫేస్‌బుక్, 1912 కాల్ సెంటర్, వాట్సాప్ చాట్‌బోట్‌ల నుంచి ఎలక్ట్రిసిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు బంజారాహిల్స్ సర్కిల్ నుంచి 448, హైదరాబాద్ సెంట్రల్ జోన్ నుంచి 1,055, హైదరాబాద్ సౌత్ సర్కిల్ నుంచి 846, సికింద్రాబాద్ సర్కిల్ నుంచి 1,107, సైబర్‌సిటీ సర్కిల్ నుంచి 1,233, రాజేంద్రనగర్ సర్కిల్ నుంచి 1,275, సరూర్‌నగర్ సర్కిల్ నుంచి 235, హబ్సీగూడ సర్కిల్ నుంచి 525, మేడ్చల్ సర్కిల్ నుంచి 1370 ఫిర్యాదులు అందాయి. సెంట్రల్ బ్రేక్‌డౌన్ విభాగంలోని క్షేత్రస్థాయి సిబ్బంది వెంటనే అప్రమత్తమై.. ఐదు నిమిషాల నుంచి అరగంట వ్యవధిలోనే మెజార్టీ ఫీడర్ల పరిధిలోని సరఫరాను పునరుద్ధరించింది. దెబ్బతిన్న ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసింది. రాబోయే వర్షాకాలంలో ఎంతటి విపత్తులు తలెత్తినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ ఇంజనీర్లు సిద్ధంగా ఉన్నారు.
33 కేవీ, 11 కేవీ లైన్స్‌పై ప్రత్యేక దృష్టి
కొత్తగా 75 సబ్‌స్టేషన్లు
స్టోర్ నుంచి డ్రా చేసిన విద్యుత్ పరికరాలపై పక్కా ఆడిట్
నిబంధనల మేరకే నోటరీ దరఖాస్తులకు విద్యుత్ కనెక్షన్లు
డిస్కం సీఎండీ జితేష్ వి పాటిల్


