● మొక్కజొన్న విక్రయాలకు ఇబ్బందులు
● కొనుగోలు కేంద్రాల వద్ద నిలిచిన ట్రాక్టర్లు
కేశంపేట: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ప్రభుత్వ మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన పంటలను గోదాంలకు తరలించేందుకు జిల్లా స్థాయిలో ట్రాన్స్‌పోర్టును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు.
లారీలు రాక ఇబ్బందులు
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం (మొక్కజొన్న) గోదాంకు తరలించేందుకు లారీలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కోనుగోలు చేసిన ధాన్యం కేంద్రాల్లోనే నిల్వ ఉండటంతో కొత్తగా రైతులు తెచ్చిన పంటలను అధికారులు కోనుగోలు చేయడం లేదు. కురుస్తున్న వర్షాలకు బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ట్రాన్స్‌పోర్టు సౌకర్యం కల్పించాల్సి ఉంది. నాలుగు రోజులు క్రితం ధాన్యం విక్రయించేందుకు రైతులు ట్రాక్టర్లలో తీసుకువచ్చారు. నాటి నుంచి కొనుగోళ్లు చేపట్టక వాహనం టైర్లలో గాలి దిగిపోయింది.
మరో 50 ట్రాక్టర్ల మక్కలు
29 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు 645 మంది రైతుల నుంచి 80,557 బ్యాగుల(50కేజీలు) ధాన్యం కొనుగోలు చేశారు. వీటిలో 64,616 బ్యాగుల మక్కలను ట్రాన్స్‌పోర్టు ద్వారా తరలించారు. ఇంకా 15,941 బ్యాగుల ధాన్యం నిల్వలు రోడ్డుపైన ఉన్నాయి. వీటికి అదనంగా కొత్తపేట గ్రామంలోని కొనుగోలు కేంద్రం వద్ద సుమారుగా పది ట్రాక్టర్లు, కేశంపేటలో 40 ట్రాక్టర్ల వరకు మక్కలను అమ్మేందుకు రైతులు వచ్చారు. పంట నిల్వ చేసేందుకు అవసరమైన గోదాంలు లేక కోనుగోలు చేసిన ధాన్యం భద్రపరిచేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.


