సదానందంగౌడ్‌కు జాజుల సన్మనం | - | Sakshi
Sakshi News home page

సదానందంగౌడ్‌కు జాజుల సన్మనం

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

సదానందంగౌడ్‌కు జాజుల సన్మనం బ్రెడ్‌ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి! డ్రగ్స్‌ విక్రేతలు అరెస్ట్‌ పావురాన్ని కాపాడబోయి.. ప్రాణాలు కోల్పోయాడు

కడ్తాల్‌: తలకొండపల్లి మండలం చెన్నంపల్లికి చెందిన సామాజిక విద్యావేత్త అయిల్‌ సదానందంగౌడ్‌కు యునైటైడ్‌ అమెరికన్‌ వర్సిటీ నిర్వాహకులు ఇటీవల చైన్నెలోని భారతీయ విద్యాభవన్‌లో గౌరవ డాక్టరేట్‌ పురస్కారం అందజేశారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సదానందంగౌడ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని, ఉస్మానియా వర్సిటీలో ఎంఏ, ఎంఫిల్‌, బీఈడీ, సెట్‌ ప్రథమ శ్రేణి పట్టాను పొందారు. విద్యారంగంలో 26 ఏళ్లుగా అధ్యాపకుడిగా పనిచేయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవలకు గుర్తింపుగా యునైటైడ్‌ అమెరికన్‌ వర్సిటీ నిర్వాహకులు సదానందంగౌడ్‌కు డాక్టరేట్‌ పురస్కారం అందజేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ అవార్డు గ్రహీత సదానందంగౌడ్‌ను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన వెంట బాలరాజు, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

శంకర్‌పల్లి: మిల్క్‌ బ్రెడ్‌ ప్యాకెట్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో బాధితులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మోకిల పీఎస్‌ పరిధిలోని జన్వాడలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల ప్రకారం.. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌కు చెందిన కుమ్మరి అశోక్‌, అంబిక దంపతులు కొన్నేళ్ల క్రితం జన్వాడకు వచ్చి నివాసం ఉంటున్నారు. వీరి మూడేళ్ల కుమారుడు పవన్‌ కోసం గ్రామంలోని ఓ కిరాణ దుకాణంలో గోల్డెన్‌ బైట్‌ కంపెనీ పేరుతో ఉన్న బ్రెడ్‌ ప్యాకెట్‌ను తీసుకెళ్లారు. బుధవారం ఉదయం పాలలో బ్రెడ్‌ వేసి బాబుకు తీనిపించాలని చూస్తుండగా, చనిపోయిన బల్లి కనిపించడంతో తల్లి ఒక్కసారిగా ఆందోళనకు గురైంది. ఈ విషయమై దుకాణ యజమానిని నిలదీయడంతో ఆయన కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌కు సమాచారం అందించారు. బల్లిని గమనించకపోతే పరిస్థితి ఎలా ఉండేదోనని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

13 గ్రాముల డ్రగ్స్‌ స్వాధీనం

మొయినాబాద్‌: జేబీఐటీ కళాశాల సమీపంలో నిషేధిత మాదకద్రవ్యాలు(డ్రగ్స్‌) విక్రయిస్తున్న ఇద్దరు యువకులను బుధవారం మొయినాబాద్‌ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన బీచ్‌మోర్‌ దల్బీర్‌ సింగ్‌, సయ్యాద్‌ ఖాదర్‌బాషా మంగళవారం రాత్రి మొయినాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎనికేపల్లి రెవెన్యూలో ఉన్న జేబీఐటీ కళాశాల వద్ద ఉన్న టీ టైమ్‌ వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో మొయినాబాద్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1.50 లక్షల విలవ చేసే 13 గ్రామాల ఎండీఎంఏ నిషేధిత మాదకద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

రాజేంద్రనగర్‌ : పావురాన్ని కాపాడబోయిన ఎన్‌ఐఆర్‌డీ రీసెర్చ్‌ అధికారి రెండో అంతస్తునుంచి పడి ప్రాణాలు కోల్పోయాడు. రాజేంద్రనగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. ఎన్‌ఐఆర్‌డీలో రీసెర్చ్‌ అధికారిగా పనిచేస్తున్న బాలరాజ్‌ (54) నివాసముంటున్న భవనం రెండో అంతస్తులో ఈ నెల 1న ఓ పావురం చిక్కుకుంది. దానిని కాపాడేందుకు బాలరాజ్‌ పైకి ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతనిని వెంటనే హైదర్‌గూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement