కందుకూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. లేమూరుకు చెందిన పల్లె బాబయ్య, రజిత దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు భానుతేజ ఇంటర్ పూర్తి చేసి ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈనెల 26న వ్యవసాయ పొలంలో ఉన్న భానుతేజను ఏదో విషయంలో అతని పెద్దనాన్న మందలించడంతో పాటు చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన భానుతేజ ఈనెల 29న ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం రాత్రి సమయంలో లేమూరు గ్రామానికి చెందిన బండి యాదయ్యకు చెందిన వ్యవసాయ భూమిలోని చెట్టుకు కుళ్లిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతుడు భానుతేజగా గుర్తించారు. బుధవారం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


