ఇద్దరు వలస కార్మికుల దుర్మరణం
షాద్‌నగర్: పరిశ్రమలో విధులు ముగించుకొని ఇంటికి వెలుతున్న ఇద్దరు వలస కార్మికులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ ఘటన నందిగామ మండల శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన రోషన్ కుమార్ (24) కొత్తూరులో, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పంకజ్ (19) నందిగామలో నివాసం ఉంటూ నందిగామ శివారులోని ఎస్‌ఎన్ పాలీప్యాక్ పరిశ్రమలో కార్మికులుగా పని చేస్తుఉన్నారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మార్గ మధ్యలో గాయత్రీ మిల్స్ ప్లాంట్ వద్ద బైపాస్ సర్వీస్ రోడ్డులో ఎదురుగా వేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై ఉన్న ఇద్దరు కార్మికులు ఎగిరి చెట్లపొదల్లో పడిపోయారు. బలమైన గాయాలవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరిశ్రమ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదానికి కారును ఘటనా స్థలిలోనే వదిలి డ్రైవర్ పరారయ్యాడు.


