● ఆస్తుల కంటే స్వచ్ఛమైన గాలి, నీరే నిజమైన వారసత్వం
● ప్రకృతి.. భగవంతుడి గొప్ప వరం: స్పీకర్ ప్రసాద్‌కుమార్
సనత్‌నగర్: ఆస్తుల కంటే స్వచ్ఛమైన గాలి, పచ్చటి వాతావరణం, పరిశుభ్రమైన నీరే నిజమైన వారసత్వమని, భావితరాలకు రూ.కోట్ల ఆస్తులను కాకుండా వీటిని అందిద్దామని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ (సీజీఆర్), సెస్ సంయుక్తంగా ‘సుస్థిర పర్యావరణం’ అనే అంశంపై బేగంపేట సెస్ ఆడిటోరియంలో నిర్వహించిన సదస్సుకు స్పీకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘‘జూన్ 4 నా పుట్టిన రోజు. నేను మూడు మొక్కలు నాటుతా. భగవంతుడు ప్రసాదించిన గొప్ప వరం ప్రకృతి. మనం దానిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాలుష్యం, అడవుల నరికివేత, నీటి వనరుల క్షీణతతో భావి తరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే ప్రకృతి సంపదను రక్షించడం, మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడం, నీటి వనరులను కాపాడడాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా భావించాలి. ఇంటి వద్ద, గ్రామంలో, పట్టణంలో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను అందరూ స్వీకరించాలి. ప్రకృతి సమతుల్యత దెబ్బతింటే మానవాళి మనుగడకే ముప్పు. పచ్చదనం పెంపొందించడం, ప్లాస్టిక్ వినియోగం తగ్గించడం, నీటి వృథాను అరికట్టడం ద్వారా ప్రకృతి సంరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలి’’ అని స్పీకర్ అన్నారు.


