అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని అడ్డుకుంటున్న సీఎం

Jun 3 2026 6:48 AM | Updated on Jun 3 2026 6:48 AM

మహేశ్వరానికి రూపాయి ఇవ్వడం లేదు

ఎమ్మెల్యే సబితారెడ్డి

మహేశ్వరం: సీఎం రేవంత్‌రెడ్డి మహేశ్వరం నియోజకవర్గంపై కక్ష గట్టి ఒక్క రూపాయి ఇవ్వకుండా అభివృద్ధికి అడ్డు తగులుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితారెడ్డి తీవ్రంగా ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్‌ మంజురు చేసిన మెడికల్‌ కాలేజ్‌, 400 పడకల ఆస్పత్రి, మెట్రోలైన్లను సీఎం రేవంత్‌రెడ్డి రద్దు చేశారన్నారు. పేదల భూములను లాక్కోని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో రాజకీయాలకు అతీతంగా కేసీఆర్‌ అర్హులకు సంక్షేమ పథకాలు రైతు బీమా, రైతు బంధు, డబుల్‌ బెడ్‌ రూమ్స్‌, దళిత బంధు, కేసీఆర్‌ కిట్స్‌ పలు సంక్షేమ పథకాలు అందించారని, నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కండువా కప్పుకొన్న వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ఉత్త మాటలు చెప్పి మభ్యపెడుతున్నారన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా రైతులను గోస పెడుతున్నారన్నారు.

ఉద్యమకారుల ఆవేదన

సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్‌ఎస్‌ నాయకులు చిలకమర్రి నర్సింహ, దిద్దెల అశోక్‌లు సభావేధికపైన సబితారెడ్డి ముందే ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఉద్యమకారులను పట్టించుకున్న పాపన పోలేదన్నారు. తమకు పదవులు ఇవ్వకుండా, వారి సంక్షేమానికి ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా అవమానపరిచారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ మాజీ సభ్యుడు నర్సింహ, పీఏసీఎఎస్‌ చైర్మన్‌ పాండుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వరెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాజునాయక్‌, సర్పంచ్‌ మునగపాటి నవీన్‌, నాయకులు అంబయ్యయాదవ్‌, చంద్రయ్య, సుధాకర్‌రెడ్డి, సమీర్‌, రాఘవేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement