బడంగ్‌పేట్: జిల్లా గ్రంథాలయంలో విద్యార్థులకు సరిపడా వసతులు కల్పించాలని మంగళవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అలుగంటి మధుసూదన్‌రెడ్డిని కలిసి విద్యార్థి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గ్రంథాలయ ప్రాంగణంలో డ్రైనేజీకి శాశ్వత పరిష్కారం కల్పించాలని కోరారు. వాటర్ ఫిల్టర్లను ఏర్పాటు చేయాలని, అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇందిరమ్మ క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. చైర్మన్ మధుసూధన్‌రెడ్డి స్పందిస్తూ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందచేసిన వారిలో నవతెలంగాణ విద్యార్థి పరిషత్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్ణగంటి రంజిత్‌కుమార్, ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ హైదరాబాద్ నగర కార్యదర్శి కొల్లూరు భీమేష్, విద్యార్థులు కృష్ణ, నరేష్ తదితరులున్నారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
షాబాద్: గ్రామంలోని సమస్యలకు ఒక్కొక్కటిగా గుర్తించి వాటికి చర్యలు తీసుకుంటానని మండలంలోని కుమ్మరిగూడ గ్రామ సర్పంచ్ శ్రీశైలం యాదవ్ పేర్కొన్నారు. మంగళవారం గ్రామంలో రూ.రెండు లక్షల పంచాయతీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్, వార్డు సభ్యులు మహేందర్, నవీన్, యాదయ్య,శేఖర్, గ్రామస్తులున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం
చేవెళ్ల: మండలంలోని ఆలూరు సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్ల పరిధిలో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతులు చేపడుతున్న కారణంగా ఈ అంతరాయం ఉంటుందని చెప్పారు. ఆలూరు, మీర్జాగూడ, ఖానాపూర్, అర్గానో ఆలూరు, అర్బన్ ఫీడర్ల పరిధిలో ఉన్న రైతులు, ప్రజలు విద్యుత్ అధికారులకు సహకరించాలని కోరారు.
కార్మికులకు సన్మానం
మొయినాబాద్‌రూరల్: గ్రామాలు అభివృద్ధి చెందితేనే సమ్మిళిత ప్రగతి సాధ్యమని మండలంలోని కేతిరెడ్డిపల్లి సర్పంచ్ గోడుగు యాదయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పంచాయతీ కార్మికులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సన్మానించి వారికి నెల రోజుల సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.


