కొత్తూరు: డంప్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా జేఏసీ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ప్రజా చైతన్యయాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని వైఎంతండా, చింతగట్టు, పులిచర్లకుంటతండాల్లో జానపద కళాకారులు డంప్‌యార్డు ఏర్పాటు చేస్తే కలిగే అనర్థాలపై పాటలు, నృత్యాల ద్వారా ప్రజలకు చైతన్యం కల్పించారు. ఒక్కసారి బీజం పడితే చెట్టు వృక్షమైన మాదిరిగా డంపింగ్‌యార్డులో చెత్త కొండలుగా పేరుకుపోతుందన్నారు. చెత్త నిల్వ కారణంగా పరిసర ప్రాంతాలు వాతావరణ, పొగ, నీటి కాలుష్యంతో ప్రజలు, జీవరాశులు అనేక రోగాల బారిన పడతాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డంప్‌యార్డు ఏర్పాటును అడ్డుకుంటామని జేఏసీ సభ్యులు స్పస్టం చేశారు. కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు అంబటి ప్రభాకర్, ఎల్లారం శేఖర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


