చేవెళ్ల: పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ పథకాలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం మండలంలోని 38 మంది లబ్ధిదారులకు వచ్చిన కల్యాణలక్ష్మి చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ఆడబిడ్డల పెళ్లిలకు ఆర్థిక సహకారం అందిస్తూ ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ, మండలంలోని ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రేపు రైతులకు గ్రామసభ
షాద్‌నగర్: మున్సిపాలిటీ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్లాట్లు, ఇళ్లు కోల్పోయే వారికి నష్టపరిహారంపై చర్చించేందుకు ఈ నెల 3న మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11.30లకు గ్రామసభ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్డీఓ సరిత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. చటాన్‌పల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 180 నుంచి 183 వరకు, అదేవిధంగా 674, 675, 695, 696, 697లలో 15,653 చదరపు గజాలు ఎల్‌సీ నంబర్ 27 వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. ప్లాట్లు, ఇళ్లు కోల్పోయే వారు హాజరై సభను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
ప్రజాసమస్యల పరిష్కారానికే ప్రజావాణి
ఏఓ ప్రభుదాస్
చేవెళ్ల: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం ఏఓ ప్రభుదాస్ తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 14 ఫిర్యాదులు వచ్చాయని ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 7, పెన్షన్‌లపై 5, డబుల్ బెడ్రూం కోసం ఒకటి, సివిల్ సప్‌లైపై ఒక ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ప్రజలు అందించిన ఫిర్యాదులను వెంటనే సంబంధిత శాఖలతో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థికి సన్మానం
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దేవునిబండతండాకు చెందిన బాదావత్ అఖిత ఐఐటీ ఆలిండియా స్థాయిలో 831 ర్యాంకు సాధించి సత్తాచాటింది. ఈ మేరకు సోమవారం గ్రామ సర్పంచ్ శ్రీను విద్యార్థిని అభినందిస్తూ.. పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల పరిధిలోని గంట్లవెళ్లి ప్రభుత్వ పాఠశాల, మొగిలిగిద్ద కస్తూర్బా గాంధీ విద్యాలయం(కేజీబీవీ)లో చదువుకున్న అఖిల ఐఐటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచడం అభినందనీయమన్నారు.


