మొయినాబాద్‌రూరల్: రాష్ట్రంలో సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల కోసం నగరంలో చేపట్టిన ధర్నాకు వెళ్లనీయకుండా ముందస్తుగా అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని మాజీ సర్పంచ్ స్వప్నఅంజయ్యగౌడ్ అన్నా రు. సోమవారం మండల పరిధిలోని నక్కలపల్లిలో ఆయనను మొయినాబాద్ పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీ ద్వారా అభివృద్ధి పనులు చేసినా.. వాటికి ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. బిల్లుల కోసం నగరంలో నిర్వహించే ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్నందుకు పోలీసులు హౌస్ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. ప్రభుత్వం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
షాద్‌నగర్ ఎంవీఐగా స్వప్న
షాద్‌నగర్: మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న వాసును సంగారెడ్డి కార్యాలయానికి బదిలీ చేస్తూ సోమవారం ఉన్నతాధికారులు ఉత్వర్తులు జారీ చేశారు. ఆయన స్థానంలో నల్గొండ ఎంవీఐగా పనిచేసిన స్వప్న ఇక్కడికి రానున్నారు. రెండేళ్ల కాలం పాటు షాద్‌నగర్ ఎంవీఐగా బాధ్యతలు నిర్వహించిన వాసు అందరి మన్ననలు పొందారు.
శంకర్‌పల్లి ఎంపీడీఓగా ప్రవీణ్‌కుమార్
శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మండల ఎంపీడీఓగా ప్రవీణ్‌కుమార్ సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన జిల్లేడు చౌదరిగూడెం నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ పనిచేసిన వెంకయ్య పదోన్నతిపై వేరే జిల్లాకి బదిలీపై వెళ్లారు. ప్రజాప్రతినిధులు, ప్రజలను సమన్వయం చేసుకుంటూ మండలాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీడీఓ స్పష్టం చేశారు.
ఇళ్ల స్థలాలను గ్రామ కంఠంలో కలపాలని వినతి
కేశంపేట: మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామంలో ఇళ్ల స్థలాలను గ్రామ కంఠంలో కలపాలని కోరుతూ సర్పంచ్ మంజుల సోమవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. గ్రామంలోని సర్వే నంబర్ 83, 96లలో 1983లో ఇందిరమ్మ ఇళ్ల కోసం డాక్యుమెంట్ 8/1983 ద్వారా 3.46 గుంటల భూమిని రైతులు వెంకట్‌రెడ్డి, సీతారాంరెడ్డి విక్రయించారని సర్పంచ్ తెలిపారు. అప్పటి నుంచి అక్కడ ఇళ్లు నిర్మించుకున్నా నేటికీ భూ భారతిలో రైతుల పేర్లు వస్తున్నాయని ఆమె తెలిపారు. భూభారతిలో రైతుల పేర్లను తొలగించి, గ్రామకంఠంగా మార్చాలని ఆమె వినతిపత్రంలో కోరారు.


