మొయినాబాద్: నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న అక్రమ మైనింగ్‌ను ఆపాలని మండల పరిధిలోని కనకమామిడి గ్రామస్తులు చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోమవారం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వారు ఏఓ ప్రభుదాస్‌కు ఫిర్యాదు అందజేశారు. కనకమామిడి రెవెన్యూలోని సర్వే నంబర్ 51/1, 510లో అక్రమంగా మైనింగ్ జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయా సర్వే నంబర్లలోని గుట్టలను రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తవ్వి మట్టిని తరలిస్తున్నారని వివరించారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న మెగా సంస్థ ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా మైనింగ్ చేస్తోందని తెలిపారు. వెంటనే అడ్డుకొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో రైతు కూలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఉన్నారు.


