వాహనాల గంతులు | - | Sakshi
Sakshi News home page

వాహనాల గంతులు

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

గుంతలమయంగా గ్రామాల రహదారులు

వాహనదారులకు తప్పని నరకయాతన

పట్టించుకోని అధికారులు

రోడ్లన్నీ గుంతలు..

మహేశ్వరం: ఆడుగుకో గుంత.. వాహనదారులకు తప్పని తంటా అన్నట్లుగా ఉంది గ్రామాలు, తండాల్లో రోడ్ల దుస్థితి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు నరకప్రాయంగా మారుతున్నాయి. కాంట్రాక్టర్‌ నాసిరకం పనులు, అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.

గుంతలు పడి.. కంకర తేలి

మండలంలోని మన్సాన్‌పల్లి చౌరస్తా నుంచి నాగారం, మన్సాన్‌పల్లి చౌరస్తా నుంచి అమీర్‌పేట్‌, రామారావు చౌరస్తా నుంచి నాగిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి నుంచి హబిబుల్లాగూడ(గొల్లూరు రోడ్డు), హబిబుల్లాగూడ నుంచి సంఘీగూడ, మెహబ్బత్‌నగర్‌ గేటు(శ్రీశైలం జాతీయ రహదారి) మెహబ్బత్‌నగర్‌, తుమ్మలూరు రోడ్డు గుంతలమయంగా మారాయి. దీంతో ఆయా రోడ్లపై ప్రయాణించాలంటే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. చాలా చోట్ల నిత్యం ప్రమాణాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్లపైన ఎటు చూసినా గుంత పడి, రాళ్లు తేలి ప్రమాదకరంగా మారడంలో అవస్థలు పడుతున్నామని ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. నరకానికి నకళ్లులా మారిన గ్రామ రహదారుల అభివృద్ధిని పాలకులు, అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.

నిత్యం వందలాది వాహనాలు

ప్రధానంగా మన్సాన్‌పల్లి చౌరస్తా నుంచి నాగారం, మన్సాన్‌పల్లి చౌరస్తా నుంచి అమీర్‌పేట్‌ వరకు గల రోడ్డు గుంతల మయంగా మారి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. ఈ రోడ్డుపై నిత్యం వందలాది వాహనాలు ఔటర్‌ రింగ్‌ ఎగ్జిట్‌ 15 వరకు, శంషాబాద్‌, అదే విధంగా అమీర్‌పేట్‌ గ్రామం నుంచి బెంగుళూరు రహదారి, కొత్తూరు, మహేశ్వరం మండల కేంద్రానికి వెళ్తుంటారు. రాత్రి వేళల్లో నిత్యం ఈ రోడ్డుపై ఎదో ఒకచోట ప్రమాదం జరుగుతూనే ఉంది.

తప్పని అవస్థలు

మండల పరిధిలోని మన్సాన్‌పల్లి చౌరస్తా నుంచి నాగారం వరకు గల బీటీరోడ్డు గుంతలుగా మారి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. మహేశ్వరం, మన్సాన్‌పల్లి, కోళ్లపడకల్‌, దుబ్బచర్ల, కల్వకోల్‌, పెండ్యాల, సుభాన్‌పూర్‌ గ్రామాలతో పాటు కొత్తురు మండలం, కేశంపేట్‌ మండలాలకు చెందిన గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై నుంచి నిత్యం ప్రయాణిస్తూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, శంషాబాద్‌, హైదరాబాద్‌ వెళ్తుంటారు. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో నరయాతన పడుతున్నామని, వాహనాలు పాడవుతున్నాయని వాహనదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలలో ఈ రోడ్డుపై తరచూ ప్రమాదాలు జరుతున్నా, అధికారులు స్పందించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement