పేద గూటికి పండగ | - | Sakshi
Sakshi News home page

పేద గూటికి పండగ

Jun 1 2026 7:29 AM | Updated on Jun 1 2026 7:29 AM

కోర్‌ పరిధిలో డబుల్‌ బెడ్రూం ఇళ్ల పరిస్థితి ఇలా..

స్థానికంగానే లబ్ధిదారులకు ఇళ్ల వసతి

క్యూర్‌ పరిధిలో నేటి నుంచి పంపిణీ

జీ+5, జీ+9 పద్ధతిలో నిర్మాణాలు

సాక్షి, సిటీబ్యూరో: క్యూర్‌ పరిధిలో పేదల గృహ నిర్మాణ పథకాల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. సోమవారం నుంచి హైదరాబాద్‌ మినహా రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లతో పాటు, నూతన ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ పర్వం సాగనుంది. మొత్తం 25,619 డబుల్‌ బెడ్రూం ఇళ్లకు గాను సుమారు 4,296 ఇళ్లు సిద్దంగా ఉన్నాయి. ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో అర్హులకు ఇళ్ల పట్టాలు, తాళాలు అందజేసేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. స్థానికంగానే లబ్ధిదారులకు ఇళ్ల వసతి కల్పించే విధంగా హౌసింగ్‌ శాఖ చర్యలు చేపట్టింది.

● హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను విడతల వారీగా పంపిణీ చేయనున్నారు. అయితే.. ఇంకా ముహుర్తం ఖరారు కాలేదు. నగరంలో స్థలాభావం ఉన్నప్పటికీ గతంలో జీ+5, జీ+9 పద్ధతుల్లో నిర్మించిన గృహ సముదాయాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి

● రంగారెడ్డి జిల్లాలో అటు డబుల్‌ బెడ్రూం ఇళ్లతో పాటు, సొంత స్థలం కలిగిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధుల మంజూరు పత్రాల పంపిణీ కూడా వేగవంతం కానుంది. పారదర్శకమైన క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం లబ్ధిదారుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు.

● కార్మికులు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో ఇళ్ల పంపిణీకి రంగం సిద్దమైంది. మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్‌, రోడ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న గృహ సముదాయాలను లబ్ధిదారులకు అప్పగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

● సంగారెడ్డి జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న నిరుపేదలకు చారిత్రాత్మక రోజు కానుంది. ఇటు పక్కా ఇళ్ల పంపిణీ, అటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఆర్థిక సహాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసే ప్రక్రియను మంత్రుల సమక్షంలో ప్రారంభించనున్నారు.

దళారుల బెడద లేకుండా నేరుగా లబ్ధి

ఇళ్ల పంపిణీలో ప్రభుత్వం పూర్తి పారదర్శకతను పాటించింది. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా, క్షేత్రస్థాయిలో రెవెన్యూ మున్సిపల్‌ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి నిజమైన అర్హులను మాత్రమే ఎంపిక చేశారు. ఎలాంటి రాజకీయ జోక్యం, దళారుల ప్రమేయం లేకుండా కంప్యూటరైజ్డ్‌ డ్రా (లాటరీ) పద్ధతిలో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగనుంది.

జిల్లా నిర్మాణంలో ఉన్నవి పూర్తయినవి మొత్తం

హైదరాబాద్‌ 1,689 1,077 2,766

రంగారెడ్డి 7,606 1,057 8,663

మేడ్చల్‌–మల్కాజిగిరి 6,448 1,365 7,813

సంగారెడ్డి 5,580 797 6,377

Advertisement
 
Advertisement
Advertisement