షాబాద్: ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేసి హుక్కా తాగుతున్న ఇద్దరిని అరెస్టు చేసిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోలిపేట్ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోలిపేట్ గ్రామం శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో హుక్కా పార్టీ కొనసాగుతున్నట్లు సమాచారం అందింది. పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మొయినాబాద్‌రూరల్: విద్యుదాఘాతంతో మూడు దూడలు, ట్రాక్టర్, పశువుల మేత దగ్ధమైన సంఘటన మండలంలోని చందానగర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. చందానగర్ గ్రామానికి చెందిన రాజేష్ పశువుల పాకలో మధ్యాహ్నం ట్రాక్టర్, పశువులకు వేసే సొప్ప కరెంటు షాక్‌తో దగ్ధమైంది. ఎండలు జోరుగా ఉండడంతో మూడు దూడలు సజీవంగా దహనం అయ్యాయి. అదే విధంగా పాలిచ్చే గేదెలు, ఆవులకు సైతం తీవ్రంగా గాయపడ్డాయి. దాదాపు రూ.20–22 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులతో పాటు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
చేవెళ్ల: పేకాట స్థావరంపై ఓఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కందవాడ సమీపంలోని లొద్దిశివారులో చోటు చేసుకుంది. సీఐ భూపాల్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కందవాడ అనుబంధంగా ఉన్న లొద్ది శివారులో ఉన్న ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2,020 నగదు, ఓ కారు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.


