● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
కడ్తాల్: దైవ దర్శనానికి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన షాద్‌నగర్–కడ్తాల్ ప్రధాన రహదారిపై మక్తమాధారం సమీపంలో చోటు చేసుకుంది. సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కేశంపేట మండలం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన బోడనంపల్లి శివ(23), తన స్నేహితులైన పాపిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సురమోని పవన్‌కుమార్, అనిల్, పవన్ కలిసి ఆదివారం సాయంత్రం మైసిగండి మైసమ్మను దర్శించుకునేందుకు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో మక్తమాధారం గ్రామ శివారులోకి చేరుకోగానే కారు నడుపుతున్న అనిల్ అజాగ్రత్తగా నడిపి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శివకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా.. పవన్‌కుమార్, పవన్‌లకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు సేకరించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శివ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.


