కూకట్‌పల్లి భూముల్లో హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లి పరిధిలోని 13.17 ఎకరాల భూమి విషయంలో హైడ్రా చర్యలపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు పరిధిలోని అంశంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలున్నా.. ఎలా కూల్చివేతలు చేపడతారని ప్రశ్నించింది. ఈ నెల 25న హైడ్రా చర్యలకు ముందు ఎలా ఉందో అదే స్థితికి తీసుకుని రావాలని అధికారులను ఆదేశించింది. రెవెన్యూ, హైడ్రా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేస్తే వెంటనే తొలగించాలని తేల్చిచెప్పింది. గతంలోలాగ 24 గంటల్లో ప్రహరీ కంచెను, రేకుల షెడ్‌లను, ప్రవేశ ద్వారాన్ని పునర్నిర్మించాలని, విద్యుత్ సర్వీస్ లైన్లు, లైటింగ్ మౌలిక సదుపాయాలు, అనుబంధ విద్యుత్ పరికరాలను పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని పనులు సకాలంలో పూర్తి చేసి పిటిషనర్‌కు భూమిని అప్పగించాలంది. ఒకవేళ అధికారులు అలా చేయని పక్షంలో పిటిషనర్.. సదరు పనులన్నీ పూర్తి చేసి అయిన ఖర్చును కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. ఆ మొత్తాన్ని ధిక్కారానికి పాల్పడిన వారి వ్యక్తిగత నిధుల నుంచి వసూలు చేస్తామంది. సదరు భూమికి సంబంధించి కోర్టు కేసు ముగిసే వరకు హైడ్రా, రెవెన్యూ సహా ఇతర అధికారులెవరూ పిటిషనర్‌కు ఎలాంటి ఆటంకం కలిగించవద్దని చెప్పింది. తదుపరి విచారణ వచ్చే నెల 4కు వాయిదా వేసింది.
● కూకట్‌పల్లిలోని 13.17 ఎకరాలకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారంటూ ఎన్‌వీఎన్ కన్‌స్ట్రక్షన్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2022, 2024, 2025 సంవత్సరాల్లో భూమిలో అధికారులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చిందన్నారు. మే 25, 26 తేదీల్లో ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా భూమిలోకి ప్రవేశించి కాంపౌండ్ ఫెన్సింగ్, భద్రతా గదులు, ప్రవేశ ద్వారాన్ని కూల్చివేసి, విద్యుత్ సరఫరా నిలిపివేసి, భూమిని స్వాధీనం చేసుకున్నారన్నారు. ప్రభుత్వమే జీఓ ఇచ్చి..డబ్బు కట్టించుకుని..పంచనామా చేసి ప్రభుత్వమే స్వాధీనం చేసిన భూమిలోకి మళ్లీ హైడ్రా ప్రవేశించడం దారుణమన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రాథమికంగా హైడ్రా కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోందన్నారు. న్యాయస్థానం అనుమతి పొందకుండా కూల్చివేతలు, ఫెన్సింగ్ ఏర్పాటు, బోర్డులు ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమన్నారు. ముందు కూల్చివేయడం, తరువాత ఫెన్సింగ్ వేసి బోర్డులు పెట్టడం, ఆ తర్వాత చర్యలను సమర్థించుకోవడం హైడ్రా అనుసరిస్తున్న పద్ధతిగా కనిపిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మే 25కు ముందు భూమి స్థితి ఎలా ఉందో అలా 24 గంటల్లో పునరుద్ధరించాలని హైడ్రా, సంబంధిత అధికారులను ఆదేశిస్తూ విచారణ వాయిదా వేశారు.
కూల్చివేయడం, సమర్థ్ధించుకోవడం పరిపాటిగా మారింది
24 గంటల్లో భూమి గత స్థితిని పునరుద్ధరించాలి
విచారణ వచ్చే నెల 4కు వాయిదా


