ఆమనగల్లు: ఉపాధి హామీ పథకం కూలీలకు కనీస వేతనం రూ.800 అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య డిమాండ్ చేశారు. మండలంలోని చింతలపల్లి, మంగళపల్లి గ్రామాలో శనివారం ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించేందుకు గతంలో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిందని చెప్పారు. దీంతో ఎంతో మందికి ఉపాధి లభించిందన్నారు. నిరుపేదలకు అండగా నిలిచిన ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరిట ఉన్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం వీబీజీరామ్‌జీ అంటూ పేరుమార్చడం తగదన్నారు. గతంలో లేని చట్టాలను తీసుకువస్తూ కూలీల పొట్ట గొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. పాత పద్ధతిలో కూలీలకు పని కల్పించాలని, ఫొటో విధానాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రమేశ్, మల్లేశ్, రామచంద్రయ్య, నర్సింహ, మల్లయ్య, పృథ్వీ, లక్ష్మయ్య, జంగయ్య, మల్లయ్య, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య


