ఇబ్రహీంపట్నం రూరల్: దేశ వ్యాప్తంగా నిర్వహించే సీయూఈటీ(కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్) పరీక్ష నిబంధనలకు విరుద్ధంగా గంటన్నరకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శేరిగూడలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న అయాన్ డిజిటల్‌లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన సీయూఈటీ పరీక్ష ఆలస్యంగా 10:45కి మొదలు పెట్టారు. ఎందుకు ఆలస్యమైందని అభ్యర్థులు ప్రశ్నించగా నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో బయట ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున అయాన్ డిజిటల్ గేటు ఎదుట ఆందోళన చేపట్టడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. సాంకేతిక కారణాలతో పరీక్ష ఆలస్యమైందని చివరికి నిర్వాహకులు సెలవిచ్చారు. దీంతో మధ్యాహ్నం ప్రారంభమయ్యే పరీక్ష సైతం ఆలస్యం అయినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అయాన్ డిజిటల్ ఎదుట విద్యార్థుల ఆందోళన


