చేవెళ్ల: బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో త్రీవంగా గాయపడిప వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన చేవెళ్ల ఠాణా పరిధిలోని అంతారం సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. అంతారం గ్రామానికి చెందిన బేగరి వెంకటయ్య(32) షాబాద్ మండలం హైతాబాద్ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కొన్ని రోజులుగా పనికి వెళ్లడం లేదు. శుక్రవారం ఇంటి వద్దనే ఉన్న అతడు పనినిమిత్తం తన బైక్‌పై చేవెళ్ల మండలకేంద్రానికి వచ్చి తిరుగుప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలవడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యుల సలహా మేరకు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వెంకటయ్య శనివారం మధ్యాహ్నం పరిస్థిని విషమించి మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మీ, కొడుకు, కూతురు ఉన్నారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


