పీఆర్టీయూ జిల్లా
మాజీ అధ్యక్షుడు గోవర్ధన్
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్‌ఎంసీ పరిధి నుంచి ఎనిమిది కిలో మీటర్ల ఫెరిఫెరల్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు సంబంధించి హెచ్‌ఆర్‌ఏ పెంచడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని పీఆర్‌టీయూ నాయకులు అన్నారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో డీఆర్‌ఓ శారదాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. నోటిఫికేషన్‌లో 15 రోజులు అభ్యంతరాల సేకరణకు గడువులో భాగంగా ఎనిమిది కిలో మీటర్ల ఫెరిఫెరల్ పరిధిలో ఉండి నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన గ్రామాల జాబితాను అందించామన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని పోచారం, మల్సెట్టిగూడ, రాంరెడ్డి గూడ, కప్పపహాడ్, మహేశ్వరంలోని రామచంద్రగూడ, గట్టుపల్లి, కల్వకోల్, పెద్దమ్మతండా, చిన్నతుప్రా, నల్లచెరువు తండా గ్రామాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్‌టీయూ జిల్లా మాజీ అధ్యక్షుడు గోవర్ధన్, ఇబ్రహీంపట్నం మండల శాఖ అధ్యక్షుడు పరమేశ్ ,జానకీరామ్, చంద్రశేఖర్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.


