అబ్దుల్లాపూర్‌మెట్: మండల పరిధిలోని కోహెడలో అత్యాధునిక వసతులతో కూడిన అంతర్జాతీయ స్థాయి సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. కోహెడలోని సర్వేనంబర్ 167/1లో సుమారు 179 ఎకరాల్లో విడతల వారీగా రూ.2 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మార్కెట్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. జూన్ 3వ తేదీన మొదటి విడతగా రూ.558 కోట్లతో పనులు ప్రారంభించనుండగా.. వారం రోజులుగా మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ స్థలంలో శరవేగంగా పనులను కొనసాగిస్తున్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేయనున్న బహిరంగ సభకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కార్యక్రమానికి వచ్చే రైతులు, సామాన్య ప్రజల నుంచి వీఐపీల వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్నాభిన్నమైన గడ్డిఅన్నారం మార్కెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న చిరకాల కోరిక నెరవేర్చుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు. భూములు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తా. మొత్తం మూడు విడతలుగా మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నాం. జూన్ 3వ తేదీన సాయంత్రం 5గంటలకు జరిగే సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.
– చిలుక మధుసూదన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్, గడ్డిఅన్నారం
అంతర్జాతీయ పండ్ల మార్కెట్ నిర్మాణానికి తొలివిడతగా రూ.558 కోట్లు
జూన్ 3న పనులు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి


