రోహింగ్యాల దొంగ ఓట్లను తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

రోహింగ్యాల దొంగ ఓట్లను తొలగించాలి

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

రోహింగ్యాల దొంగ ఓట్లను తొలగించాలి నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు తల్లీపిల్లలకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు నాగ్‌పూర్‌ విమానంలో సాంకేతిక లోపం

కలెక్టర్‌కు అందెల వినతి

బడంగ్‌పేట్‌: నియోజకవర్గంలో రోహింగ్యాల కు దొంగ ఓట్లు ఉన్నాయని వాటిని తొలగించా లని బీజేపీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్‌చార్జి అందెల శ్రీరాములు యాదవ్‌ కోరారు. ఈ మేరకు శనివారం ఆయన కలెక్టర్‌ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని పహాడీషరీఫ్‌, షాహీన్‌నగర్‌, జల్‌పల్లి డివిజన్‌ లలో రోహింగ్యాలకు దొంగ ఓట్లు ఉన్నాయ న్నారు. 26 బూత్‌లలో 9,960 ఓట్లు గుర్తించామని చెప్పారు. 392, 393 బూత్‌లలో అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు సైతం ఓట్లు ఉన్నాయన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రోగ్రాంలో గుర్తించిన దొంగ ఓట్లను పూర్తి విచారణ జరిపించి తొలగించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవేందర్‌రెడ్డి, నాయకులు అంబోజీ శ్రీనివాస్‌, పోరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రాజమోని రాజుముదిరాజ్‌ తదితరులు ఉన్నారు.

కార్పొరేట్‌ విద్యాసంస్థలపై చర్యలకు వినతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్‌ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం వారు కలెక్టరేట్‌లోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో డీఈఓ సుశీంధర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి శివకుమార్‌ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు నిబంధనలు విరుద్ధంగా ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని చెప్పారు. అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించాల్సి ఉండగా అందుకు భిన్నంగా తల్లిదండ్రులను ఆకర్శించేందుకు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అక్షయ్‌, శివ, త్రినయ్‌, కార్తీక్‌ పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం రూరల్‌: తల్లీబిడ్డలు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు సంపాదించి అరుదైన ఘనత సాధించారు. మండల పరిధిలోని ఎల్మినేడు అనుబంధ గ్రామం మెటిల్లాకు చెందిన గుంటి అరుణ ఆమె కూతుళ్లు అభిజ్ఞ రోజ్‌ (10), శ్రీవిజ్ఞ (8) శుక్రవారం నగరంలోని గచ్చిబౌలి ఆడిటోరియంలో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కీ బోర్డు ప్లే పోటీల్లో సత్తాచాటారు. 22 దేశాల నుంచి 2వేల మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో కీబోర్డు వాయిద్యకారులు గంట పాటు నిర్విరామంగా కీబోర్డు ప్లే చేశారు. ఇందులో 777 మంది ప్రతిభ చాటారు. వీరికి వ్యవస్థాపకుడు అగస్టిన్‌ దండింగిచేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. గుంటి అరుణ స్వగ్రామంలో అంగన్‌వాటీ టీచర్‌గా పని చేస్తూ ఈ ఘనత సాధించడం తమకు గర్వకారణమని గ్రామస్తులు, తల్లి ప్రోత్సాహంతో పిల్లలు సైతం రాణించి తమ పాఠశాలకు మంచి పేరుతీసుకువచ్చారని టీఆర్‌ఆర్‌ పాఠశాల యాజమాన్యం అభినందనలు తెలిపారు.

శంషాబాద్‌: బెంగళూరు నుంచి నాగ్‌పూర్‌ బయలుదేరిన విమానం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండయ్యింది. శనివారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి 126 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో 6ఈ–6003 విమానం మార్గంమధ్యలో ఉండగా సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్‌ వెంటనే అప్రమత్తమయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏటీసీ అధికారులను సంప్రదించారు. ఏటీసీ అనుమతి మేరకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఎయిర్‌లైన్స్‌ ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు నాగ్‌పూర్‌కు బయలుదేరారు.

Advertisement
 
Advertisement
Advertisement